Governor Tamilisai: నేను తమిళ ఆడబిడ్డను.. తెలంగాణకు అక్కను.. నేను మీతో ఉన్నాను.. మీ కుటుంబంలో ఒక సభ్యురాలని.. మీ సమస్యలు విన్నాను.. నేను మీతో ఉన్నాను కచ్చితంగా మీ సమస్యలు పరిష్కారమయ్యే దిశగా నా వంతు ప్రయత్నం చేస్తాను అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. భద్రాచలంలో ఆదివాసీలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. వారి సమస్యలను విని.. స్పందించారు.. ఈ సమస్యలన్నింటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అందరి కష్టాలు తొలగే విధంగా నేను కృషి చేస్తానని తెలిపారు. ఏ ఒక్కరూ బాధపడవద్దని.. అందరూ సంతోషంగా ఉండే విధంగా నేను సీతారామచంద్రస్వామి వేడుకున్నారని తెలిపారు గవన్నర్ తమిళిసై.
కాగా, రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైనటువంటి భద్రాచలం పట్టణ సరిహద్దు పంచాయతీలు అయినటువంటి కన్నాయిగూడెం, ఎటపాక, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం పంచాయతీల తరఫున గవర్నర్ గారికి తమ సమస్యలను వినిపించారు ఆదివాసీలు.. తమను వెంటనే తెలంగాణలో విలీనం చేయాలని.. అలా చేయకపోతే తమకు భవిష్యత్తు లేదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో తమ సమస్యలను విన్నవించుకున్నారు ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు. ఇక, వీరభద్ర ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఆదివాసులతో ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై తనకు కేటాయించిన ప్రత్యేక కుర్చీని తొలగించమని కోరారు.. అందరితో సమానంగా సాధారణ కుర్చీలో కూర్చున్నారు గవర్నర్ తమిళిసై.
భద్రాచలం రావడం నా ఇంటికి నేను వచ్చినట్టుగా ఉందన్నారు గవర్నర్.. మిమ్మల్ని సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ధి చేయడంలో అందరం కలిసి పనిచేయాల్సి ఉందన్నారు.. నా వంతుగా రాజభవన్ నుండి మీ ఆరోగ్య రక్షణకు అంబులెన్సులు, ఎలక్ట్రిక్ ఆటోలు ఇవ్వడం ఆనందంగా ఉంది.. స్కూళ్లలో అదనపు గదులు నిర్మాణం, అంగన్‌వాడీ సెంటర్ల నిర్మాణం మీ పిల్లల చదువు కోసం పని చేయడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. మీ అభివృద్ధిలో పాలుపంచుకోవడం నాకు చాలా సంతోషం.. స్వయం ఉపాధి శిక్షణ మహిళా సాధికారత కోసం మరిన్ని పనులు త్వరలో చేపడుతాం అన్నారు. ఒక డాక్టర్ గా మీ అందరికి ఆరోగ్య పరీక్షలు నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది.. ఎవరు బాగుపడాలన్నా ఎవరు అభివృద్ధి చెందాలని విద్య చాలా అవసరం.. ఆదివాసి పిల్లలకు నేటి వరకు నాణ్యమైన విద్య అందుబాటు లేకపోవడం చాలా బాధాకరం అన్నారు.
విద్య ఆదివాసీలకు ఎదగడానికి పనిచేస్తుంది.. ఆదివాసీలకు ఆరోగ్యం అనేది అందని ద్రాక్షగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు తమిళిసై… సరైన పోషకాహారం అందుకు వారు బలహీనులుగా మిగిలిపోతున్నారు.. వారికి నాణ్యమైన పోషకాహారం అందేలా చర్యలు చేపడతామన్న ఆమె.. అసమానతలు నిర్మూలించి అందరూ సమానంగా జీవించే విధంగా పనిచేస్తాం అని ప్రకటించారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా.. ఆదివాసీలకు అవి అందడం లేదు.. ఆదివాసీలందరూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందినప్పుడే నాకు నిజమైన సంతోషం. మీ జీవితాల్లో మార్పులు రావాలి. మీ అభివృద్ధి నేను చూడాలి.. అదే నాకు నిజమైన సంతోషం.. నీ చిరునవ్వులు నేను చూడాలి.. నీతో కలిసి మీలో ఒక్కరిగా.. మీ అభివృద్ధిలో నేను ఉంటాను అని మాట ఇస్తున్నాను.. మీ అందరికీ మరొక్కసారి అభినందనలు అంటూ తన ప్రసంగాన్ని ముగించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.