Google Layoffs 2024: టెక్ దిగ్గజం ‘గూగుల్’ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ రాసిన అంతర్గత లేఖలో పేర్కొన్నారు. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 2024లో మరింత మంది ఉద్యోగులను తొలగిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.
‘ఏఐ వల్ల టెక్ రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. కోట్లాది మంది కస్టమర్లకు మెరుగైన ఉత్పత్తులను అందించడానికి ఇది ఒక మంచి అవకాశం. అయితే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. మన ప్రాధాన్యాలు ఏంటో గుర్తించి.. వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఫలితంగా నైపుణ్యం కలిగిన కొంతమంది సభ్యులను తొలగించాల్సి వస్తోంది. ఇది చాలా కష్టమైన విషయం అని మాకు తెలుసు. కానీ తప్పడం లేదు’ అని రూత్ పోరాట్ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Also Read: Loksabha Election 2024: ఎన్నికల ప్రచారంలో గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు!
పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కొంత మంది ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి గూగుల్ బదిలీ చేస్తోంది. భారత్‌కు కొంతమందిని తీసుకొస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నారు?, ఎంత మందిని బదిలీ చేస్తున్నారు? అనే విషయాన్ని గూగుల్ ఇంకా వెల్లడించలేదు. ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెస్లా, యాపిల్, అమెజాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించాయి. 2024లో ఇప్పటివరకు 58 వేల మంది ఉద్వాసనకు గురైనట్లు తెలుస్తోంది.