NTV Telugu Site icon

Gold Medal: ఆసియా క్రీడల్లో భారత్‌కు బంగారు పతకం!

Gold Medal

Gold Medal

India win Gold medal in Men’s 10m Air Rifle Team event in Asian Games 2023: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ బంగారు పతకంను గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకం సాధించింది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌ల త్రయం 1893.7 పాయింట్లు సాధించింది. ఆసియా గేమ్స్ 2023లో భారత్‌కు ఇదే మొదటి బంగారు పతకం. ఆసియా క్రీడల్లో తొలి రోజు భారత్‌కు ఐదు పతకాలు వచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్‌లో రజతం, కాంస్యం.. రోయింగ్‌లో రెండు రజతాలు, ఓ కాంస్యం వచ్చాయి.

షూటింగ్ క్వాలిఫికేషన్ ఫైనల్‌ రౌండ్‌లో 1893.7 స్కోర్‌తో భారత్‌ అగ్రస్ధానంలో నిలిచింది. ఆ తర్వాతి స్ధానంలో నిలిచిన ఇండోనేషియా (1890.1 స్కోర్‌) రజతం సొం‍తం చేసుకుంది. ఇక మూడో స్ధానంలో నిలిచిన చైనా.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. భారత్‌కు బంగారు పతకం రావడంతో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆసియా క్రీడలు 2023లో తొలి రోజైన ఆదివారం భారత క్రీడాకారులు మెరిపించారు. షూటింగ్‌లో రెండు, రోయింగ్‌లో మూడు పతకాలతో సత్తాచాటారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగం టీమ్‌ ఈవెంట్‌లో రమితా జిందాల్, మెహులీ ఘోష్, ఆశి చౌక్సీలతో కూడిన భారత జట్టు రజత పతకం కైవసం చేసుకుంది. రోయింగ్‌లో పురుషుల లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ ఈవెంట్‌లో అర్జున్‌ లాల్‌ జాట్‌–అరవింద్‌ సింగ్‌ ద్వయం రజత పతకం గెలుచుకుంది. పురుషుల పెయిర్‌ విభాగంలో బాబూలాల్‌ యాదవ్‌-లేఖ్‌ రామ్‌ ద్వయం కాంస్య పతకం గెలిచింది. పురుషుల కాక్స్‌డ్‌ ఎయిట్‌ ఈవెంట్‌లో భారత జట్టు రజతం గెల్చుకుంది.

Show comments