గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ముప్పు తీవ్రమైంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎద్దువాగు, పెదవాగు పొంగిపొర్లుతుండటంతో కాజ్‌వేలు, బ్రిడ్జిలు నీటమునిగాయి. దీంతో కోయిదా, దాచారం, పేరంటాలపల్లి సహా పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా దాదాపు 11 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఈ వరద వల్ల రెండు మండలాల్లోని 28 గ్రామాలు, సుమారు 8,492 మంది ప్రజలపై ప్రభావం పడింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. బాధితులను కాపాడేందుకు 25 మంది NDRF, 25 మంది SDRF బృందాలను రంగంలోకి దించింది. అత్యవసర సహాయక చర్యల కోసం 15 పడవలు, 2 లాంచీలు మరియు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే 44 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జిల్లా ఎస్పీ ప్రతాప శివ కిషోర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఉచితంగా నాణ్యమైన భోజనం, తాగునీరు, నిత్యావసరాలను అందిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, గర్భిణులు, వృద్ధులను సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సీజనల్ వ్యాధుల నివారణ మందులతో పాటు పాముకాటు విరుగుడు మందులను అందుబాటులో ఉంచారు. భద్రాచలం వద్ద ప్రవాహం తగ్గుతున్నా, ఏలూరు జిల్లాలో సాధారణ స్థితి వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

