Site icon NTV Telugu

Gmailలో సరికొత్త ఫీచర్‌.. ఇది WhatsAppలా పనిచేస్తుంది..!

Gmail New Feature

Gmail New Feature

Gmail New Feature: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే Gmail వినియోగదారులకు Google గుడ్ న్యూస్ చెప్పింది. Gmailలో ఇప్పుడు కొత్త భద్రతా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది WhatsApp, Telegram వంటి యాప్‌లలో ఉండే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానాన్ని పోలి ఉంటుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనేది డిజిటల్ భద్రతా విధానం. ఈ సిస్టమ్ ద్వారా పంపిన వ్యక్తి మరియు స్వీకరించే వ్యక్తి తప్ప, మధ్యలో మరెవరూ ఆ సందేశం లేదా ఈమెయిల్‌ను చదవలేరు. అంటే మీ సమాచారం పూర్తిగా సురక్షితంగా గమ్యస్థానానికి చేరుతుంది. సులభంగా చెప్పాలంటే, మీరు తాళం వేసిన పెట్టెను పంపితే, ఆ తాళం తెరవడానికి కీ స్వీకర్త దగ్గర మాత్రమే ఉంటుంది. ఇదే విధంగా ఈ భద్రతా వ్యవస్థ పనిచేస్తుంది.

మొబైల్‌లోనే సురక్షిత ఈమెయిల్స్
ఈ కొత్త అప్‌డేట్‌తో Android, iOS వినియోగదారులు ఇప్పుడు Gmail మొబైల్ యాప్ నుంచే ఎన్‌క్రిప్ట్ చేసిన ఈమెయిల్స్‌ను రాయడం, పంపడం, చదవడం చేయవచ్చు.. గతంలో దీనికోసం డెస్క్‌టాప్ లేదా థర్డ్ పార్టీ టూల్స్ అవసరం అయ్యేది.

ఎవరికి అందుబాటులో ఉంటుంది?
ఈ సదుపాయం ప్రధానంగా Google Workspace Enterprise వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. క్లయింట్-సైడ్ ఎన్‌క్రిప్షన్ సపోర్ట్ ఉన్న అకౌంట్లలో ఈ ఫీచర్ పనిచేస్తుంది. ముందుగా అడ్మిన్ కన్సోల్ ద్వారా Android, iOS సపోర్ట్‌ను యాక్టివేట్ చేయాలి.

యూజర్లకు ప్రయోజనాలు..
– సున్నితమైన ఈమెయిల్స్‌కు అదనపు భద్రత
– మొబైల్ నుంచే సురక్షిత మెయిల్స్ పంపే అవకాశం
– ఎటువంటి అదనపు సాఫ్ట్‌వేర్ అవసరం లేదు
– ఎక్కడి నుంచైనా సురక్షిత యాక్సెస్

Google ప్రకటన
ఈ ఫీచర్ Rapid Release మరియు Scheduled Release డొమైన్‌లలో అందుబాటులోకి వచ్చినట్లు Google తెలిపింది. దీంతో వ్యాపార సంస్థలు, ప్రొఫెషనల్ వినియోగదారులు మరింత సురక్షితంగా కమ్యూనికేట్ చేయవచ్చు. మొత్తంగా Gmailలో WhatsApp తరహా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ రావడం వినియోగదారులకు పెద్ద ప్రయోజనంగా చెప్పుకోవాలి… ముఖ్యంగా గోప్యమైన సమాచారం పంపే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. భవిష్యత్తులో సాధారణ వినియోగదారులకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version