Glenn Maxwell Fumes At World Cup 2023 Light Show: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నిర్వహిస్తోన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఫైర్ అయ్యాడు. ప్రపంచకప్ మ్యాచ్ మధ్యలో నైట్ క్లబ్ స్టైల్ లైట్ షోస్ ఏర్పాటు చేయడం సరికాదని, లైట్ షో వల్ల తనకు భయంకరమైన తలనొప్పి వచ్చిందన్నాడు. లైట్ షో అభిమానులకు అద్భుతమైన అనుభూతినిస్తుందేమో కానీ.. క్రికెటర్లకు మాత్రం భయానక అనుభవమే అని మ్యాక్సీ అన్నాడు. ఢిల్లీ వేదికగా నెదర్లాండ్స్‌ను ఆసీస్ చిత్తు చేసిన అనంతరం మ్యాక్స్‌వెల్ ఏ వ్యాఖ్యలు చేశాడు.
‘బిగ్‌బాష్ లీగ్ సమయంలో ఇలాంటి లైటింగ్ షోను పెర్త్ స్టేడియంలోనూ ఏర్పాటు చేశారు. ప్రపంచకప్ 2023లో ఢిల్లీలో అలానే నిర్వహించారు. ఇలా లైటింగ్ షో చేయడం వల్ల ఒక్కసారిగా తలనొప్పి వచ్చేస్తోంది. నేను మాత్రామే కాదు క్రికెటర్లందరూ ఇబ్బంది పడేవారు. లైటింగ్ వెలుతురు ఆగిపోయిన తర్వాత కళ్లు సరికావడానికి సమయం పట్టేది. క్రికెటర్ల విషయానికొస్తే ఇది సరైన ఆలోచన కాదనిపించింది. నేను లైటింగ్ షో జరిగిన రెండు నిమిషాల పాటు నా కళ్లను మూసుకోవడానికే ప్రయత్నిస్తా. అభిమానులకు ఈ షో మంచి అనుభూతినిస్తుందేమో కానీ క్రికెటర్లకు మాత్రం భయానక అనుభవమే’ అని గ్లెన్ మ్యాక్స్‌వెల్ అన్నాడు.
Also Read: Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి!
నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో బుధవారం మ్యాచ్ జరిగింది. నెదర్లాండ్స్ లక్ష్య ఛేదన చేస్తుండగా.. డ్రింక్స్ బ్రేక్ సమయంలోనే స్టేడియంలో డీజే సౌండ్‌తో పాటు లైటింగ్ షోను నిర్వాహకులు నిర్వహించారు. 2 నిమిషాల పాటు ఈ షో కొనసాగింది. ఈ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు కళ్లు మూసుకోవడం కెమెరాలో కనిపించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా తన చేతులతో కళ్లు మూసుకున్నాడు. మ్యాచ్ అనంతరం లైటింగ్ షో నిర్వహణపై మ్యాక్సీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 40 బంతుల్లోనే సెంచరీ చేసిన మ్యాక్స్‌వెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.