Site icon NTV Telugu

Geetha Press: గాంధీ శాంతి పురస్కారం.. కోటి నగదు బహుమతి వద్దన్న గీతా ప్రెస్

Geetha Press

Geetha Press

Geetha Press: ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌కు చెందిన ప్రముఖ ప్రచురణ సంస్థ గీతా ప్రెస్‌ను 2021 సంవత్సరానికి గాంధీ శాంతి పురస్కారానికి కేంద్రం సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. అహింస, సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పును తీసుకువచ్చే దిశగా సేవలందించిన గీతా ప్రెస్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని జ్యూరీ కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా గాంధీ సిద్ధాంతాలైన శాంతి, సామాజిక సామరస్యాన్ని పెంపొందించే దిశగా గీతా ప్రెస్ అందించిన సేవలను ప్రధాని గుర్తు చేశారు.

Also Read: Singapore Job Slowdown: భారతీయుల ఉద్యోగాలపై మాంద్యం ఎఫెక్ట్.. ఉద్యోగ ఖాళీలలో భారీ తగ్గింపు

గాంధీ శాంతి పురస్కారాన్ని తమకు ప్రకటించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్ల్లు గీతా ప్రెస్ సోమవారం తెలిపింది. అయితే ఏ విధమైన విరాళాలు స్వీకరించడం తమ సాంప్రదాయం కానందున అవార్డు కింద ప్రకటించిన రూ. 1 కోటి నగదును తాము స్వీకరించబోమని గీతా ప్రెస్ ప్రకటించింది. గాంధీ శాంతి అవార్డును ప్రకటించిన అనంతరం గీతా ప్రెస్ ట్రస్టీ బోర్డు ఆదివారం గోరఖ్‌పూర్‌లో సమావేశమైంది. రూ. 1 కోటి నగదు బహుమతిని స్వీకరించరాదని సమావేశం నిర్ణయించింది.

ప్రతిష్టాత్మక ఈ అవార్డుకు తమను ఎంపిక చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖకు గీతా ప్రెస్ ప్రచురణకర్త ధన్యవాదాలు తెలిపారు. ఇది తమకు ఎతో గౌరవప్రదమని, అయితే ఏ విధమైన విరాళాలు స్వీకరించరాదన్నది తమ సాంప్రదాయమని గీతా ప్రెస్ మేనేజర్ లాల్‌మణి త్రిపాఠి సోమవారం నాడిక్కడ విలేకరులకు తెలిపారు. నగదు రూపంలో అవార్డు తీసుకోరాదని ట్రస్టీ బోర్డు నిర్ణయించిందని, అయితే అవార్డును మాత్రం స్వీకరిస్తామని ఆయన తెలిపారు. బోర్డు చైర్మన్ కేశవ్ రాం అగర్వాల్, ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ చాంద్‌గోటియా, ట్రస్టీ దేవి దయాళ్ ప్రెస్ నిర్వహణను చూసుకుంటున్నారని త్రిపాఠి తెలిపారు.

Also Read: China: చైనా GDP వృద్ధి రేటు తగ్గింపు.. ఆందోళన చెందుతున్న ప్రపంచ దేశాలు

2021 సంవత్సరానికి గాంధీ శాంతి అవార్డు తమకు ప్రకటించిన వార్త తెలిసిన వెంటనే గీతా ప్రెస్ నెలకొని ఉన్న తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. 1923లో స్థాపించిన గీతా ప్రెస్‌లో హిందూ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక గ్రంథాల ముద్రణ జరుగుతుంది. సనాతన ధర్మ సిద్ధాంతాలను ప్రోత్సహించే లక్షంతో జయ దయాళ్ గోయంక, ఘన్‌శ్యామ్ దాస్ జలన్ గీతా ప్రెస్‌ను స్థాపించారు. ఇప్పటివరకు వివిధ భాషలలో 93 కోట్లకు పైగా పుస్తకాలను గీతా ప్రెస్ ముద్రించింది. గోరఖ్‌పూర్‌లోనే ప్రచురణ జరుగుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2.40 కోట్ల పుస్తకాలను అతి తక్కువ ధరలకు తమ పాఠకులకు అందచేయడం జరిగిందని, ఈ పుస్తకాల విలువ రూ.111 కోట్లు ఉంటుందని లాల్‌మణి త్రిపాఠి చెప్పారు. పుస్తకాలకు డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పటికీ డిమాండ్‌కు తగ్గట్టు పుస్తకాలను అందచేయలేకపోతున్నామని త్రిపాఠి తెలిపారు.

Exit mobile version