Site icon NTV Telugu

Dogs attack: బాలికపై కుక్కలు మూకుమ్మడి దాడి.. వీడియో వైరల్

Dee

Dee

గ్రామ సింహాలు మరోసారి బీభీత్సం సృష్టించాయి. ఓ బాలికపై కుక్కల గుంపు అమాంతంగా దాడికి తెగబడ్డాయి. డాగ్స్ బారి నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా విడిచిపెట్టలేదు. తలో వైపు నుంచి దాడి చేస్తూనే ఉన్నాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకుంది.

అమ్రోహా జిల్లాలో ఐదేళ్ల బాలిక శనివారం ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చింది. రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా అక్కడే ఉన్న వీధికుక్కల గుంపు దాడికి తెగబడ్డాయి. కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు చిన్నారి శతవిధాలా ప్రయత్నించినా వదిలిపెట్టలేదు. వాటితో ఆమె పోరాడుతూనే ఉంది. పరిగెత్తేందుకు ప్రయత్నించగా మరోసారి దాడి చేశాయి. కొన్ని కుక్కలు శరీరాన్ని పీక్కుతింటుంటే.. మరికొన్ని కుక్కలు జుట్టు పట్టుకుని లాగే ప్రయత్నం చేశాయి. ఒకేసారి ఐదు కుక్కలు దాడి చేయడంతో ఆ బాలిక విలవిలలాడిపోయింది. ఇంతలో అటు వైపు వస్తున్న స్థానికుడు కుక్కలను బెదిరించడంతో విడిచిపెట్టి వెళ్లిపోయాయి. గాయాల పాలైన చిన్నారిని ఎత్తుకుని ఆస్పత్రికి తరలించాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి.

వీధికుక్కలపై తీసుకుంటున్న చర్యలపై నివేదిక అందజేయాలని అధికారులకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఆయా ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్, ముజఫర్‌నగర్‌లో వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి.

ఇదిలా ఉంటే వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలంటూ దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఆందోళలు చేశారు. మున్సిపల్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ మధ్య హైదరాబాద్‌లో జరిగిన ఘటనపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. జీహెచ్‌ఎంసీ మేయర్ తీరును కూడా తీవ్రంగా తప్పుపట్టారు.

తాజాగా యూపీలో జరిగిన ఘటనకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీధి కుక్కలపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తు్న్నారు. చిన్నారుల ప్రాణాలు బలి కాకముందే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

Exit mobile version