విశాఖ తీరానికి గుండెకోతను మిగులుస్తోన్న రాకాసి అలలను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభం అయ్యాయి. 2లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీరంలో డిపాజిట్ చేసేందుకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. నెలరోజుల పాటు నిర్వహించే తీర రక్షణ చర్యల కోసం, సుమారు 20కోట్లను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఖర్చు చేయనుంది. ఇప్పటి వరకు విశాఖ తీరం మూడున్నర కిలోమీటర్ల మేర కోతకు గురైందని.. కేంద్ర భూ భౌతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఇటీవల నివేదిక విడుదల చేసింది.
పర్యావరణ సమతుల్యంలో కీలక మైన సముద్రం కొత్త సవాళ్ళు విసురుతోంది. సీజన్ మారిన ప్రతీసారీ తీరంపై విరుచుకుపడి గుండెకోతను మిగులుస్తోంది. దేశ వ్యాప్తంగా తీర ప్రాంతంలో సముద్రం సృష్టిస్తున్న అలజడిపై కేంద్ర భూ భౌతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ సర్వే నిర్వహించింది. వీటి ఆధారంగా పలు రాష్ట్రాలకు ఈ ముప్పు పొంచి ఉంది. అందాల నగరి విశాఖలోనూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.ఇప్పటి వరకు 3.5కిలో మీటర్లు మేర తీరం గల్లంతైందని సర్వే నిర్ధారించింది. నగరం అందానికి.. పర్యాటక అభివృద్ధికి బీచ్ రోడ్డే ఆయువు పట్టు. కడలి పాలైపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకూ సుమారు 35 కిలోమీటర్లు పొడవునా తీర ప్రాంతం ఉంది. బీచ్ రోడ్డును ఆనుకుని 43 తీర గ్రామాలు ఉండగా , ఇక్కడ సుమారు రెండు లక్షల మంది మత్య్సకారులు జీవిస్తున్నారు. సీజనల్ విండ్ డైరెక్షన్,స్పీడ్ ఆధారంగా సముద్రపు అలల గతి, వేగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. తీవ్ర తుఫాన్లు ఏర్పడినప్పుడు 100 నుంచి 150 కిలోమీటర్ల వరకూ గాలుల తీవ్రత వుంటోంది. వీటి ప్రభావంతో చొచ్చుకు వచ్చే అలలు తీరాన్ని మింగేస్తున్నాయి.
Read Also: Oyo Bookings: ఓయోలో రికార్డు బుకింగ్స్.. వాలెంటైన్స్ డే పుణ్యమా అని!
గత ఏడాది వాయుగుండం ప్రభావంతో వీచిన బలమైన గాలుల దెబ్బకు ఆర్.కె.బీచ్ కు అత్యంత సమీపంలో ఉన్న వరుణ్ పార్క్ ఏరియాలో కొట్టుకుపోగా…. ప్రహారీ గోడలు కూలిపోయాయి. ఇక్కడ జరుగుతున్న నష్టం కళ్ళ ముందు కనిపించినా పట్టించుకోని యంత్రాంగం…G-20 దేశాల సదస్సుల కారణంగా దిద్దుబాటుకు దిగింది. తీరం పరిరక్షణ బాధ్యతగా భావించిన విశాఖ పోర్ట్ ట్రస్ట్.. 20కోట్లు ఖర్చు చేయనుంది. గడచిన 50 ఏళ్ళ కాలంలో తీర ప్రాంతం కోత అధికంగా వుంటోందని నిపుణుల అధ్యయనంలో తేలింది.
ఒకప్పుడు రామకృష్ణ బీచ్, కోస్టల్ బ్యాటరీ ప్రాంతాల్లో కనిపించిన ఇసుక మేటలు కనుమరుగు అయ్యాయి. ఇటీవల కేంద్ర భూ భౌతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ సర్వే నిర్వహించింది. ఈ నివేదిక ఆధారంగా ఇప్పటి వరకు విశాఖ తీరంలో 3.5కిలోమీటర్ల మేర తీరం గల్లంతైనట్టు గుర్తించింది. పెద మంగమారిపేట తీరం దాదాపు స్వరూపాన్ని కోల్పోయింది. ఈ ప్రమాదం ఒక్క విశాఖకు మాత్రమే పరిమితం కాలేదు, 29 శాతం మేర రాష్ట్ర తీర ప్రాంతమంతా ఇదే పరిస్థితి ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితికి బ్రేక్ వాటర్స్,. విస్త్రతమైన పోర్టు కార్యకలాపాలు, హార్బర్ల నిర్మాణం కారణం అనే వాదన ఉంది. అయితే, అవన్నీ అపోహలు మాత్రమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. విశాఖ తీరం పరి రక్షణను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులెటీగా తీసుకుని, రక్షణ చర్యలు ప్రారంభించింది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్. డ్రెడ్జింగ్ చేసి రెండు లక్షల క్యూబిక్ మీటర్ల శాండ్ డిపాజిట్లు.. తీరానికి తరలించనుంది.
Read Also: Rare ENT Surgery: పూర్తి వినికిడి లోపం చిన్నారులకు అరుదైన ఈఎన్‌టీ ఆపరేషన్