Markapuram: మార్కాపురం పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మిచెన్నకేశవుడు నాలుగు యుగాల దేవుడిగా కామిత వరదాతగా ప్రసిద్ధి గాంచాడు. ‘కృతయుగే గజారన్నే తేత్రాయం మాదవీపురి ద్వాపరే స్వర్గసోపానం కలౌ మారికాపురి’ అని ప్రసిద్ది. కృతయుగాదిలో స్వామి ఇక్కడ వెలసినట్లు మార్కండేయ మహాముని రచించిన గజారణ్య సంహితలో ఉంది. కృతయుగంలో గజారణ్యమని ఏనుగులు తొండాలతో నీటిని తెచ్చి స్వామిని అభిషేకించేవని పురాణాలు చెబుతున్నాయి. మార్కాపురం ప్రజల ఇలవేల్పు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో జరుగుతున్న గోపుర, కలశ ప్రతిష్టా మహోత్సవంలో గిద్దలూరు శాసన సభ్యులు అన్నా రాంబాబు కుటుంబం, మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు ఆయన సతీమణి దుర్గకుమారి, కుమారుడు కృష్ణ చైతన్య, కోడలు అనూషలు పాల్గొన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డితో పాటు ఆయన సతీమణి సతీమణి కల్పనారెడ్డి, సోదరుడు కృష్ణ మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయంలో జరుగుతున్న నాలుగు గోపుర ప్రాకార కలశ ప్రతిష్ట మహోత్సవము, నూతన ధ్వజ పునః ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. అనంతరం వారు స్వామి వారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో 130 సంవత్సరాల తర్వాత నూతన ధ్వజ ప్రతిష్ఠా మహోత్సవం, నాలుగు గోపుర ప్రాకార కలశ ప్రతిష్ట మహోత్సవాలు మన మార్కాపురానికీ చారిత్రాత్మకమైన రోజు అని ఎమ్మెల్యేలు తెలిపారు.