GHMC Wards Increased to 300: జీహెచ్‌ఎంసీలో వార్డుల సంఖ్యను 300 కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల సంఖ్య డబుల్ చేసింది ప్రభుత్వం.. ORR పరిధిలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు GHMC లో విలీనం అవ్వడంతో వార్డుల సంఖ్య పెరిగింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సమర్పించిన వార్డ్ రీ ఆర్గనైజేషన్ స్టడీ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 27 అర్బన్ లోకల్ బాడీల డేటాను పరిశీలించిన కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పెరిగిన జనాభ, పట్టణ విస్తరణ, ప్రజా సేవల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వార్డుల సంఖ్య పెరిగింది. జీహెచ్‌ఎంసీ యాక్ట్ 1955 (Sec 8 & Sec 5) ప్రకారం నోటిఫికేషన్ జారీ చేశారు.
READ MORE: Telangana Rising Global Summit Day1: తొలి రోజే రూ. 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులు..
ఇదిలా ఉండగా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనానికి సంబంధించి గతంలో అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD) విభాగం… 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను తెలంగాణ మునిసిపాలిటీల చట్టం, 2019 పరిధి నుంచి అధికారికంగా తొలగిస్తూ… గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం, 1955 ప్రకారం “నగరం” పరిధిలోకి తీసుకువస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేటర్ పరిధిని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) వరకు విస్తరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. దీంతో హైదరాబాద్ శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన రికార్డులు, బాధ్యతలు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చాయి. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. జీహెచ్‌ఎంసీలోని ఏ డిప్యూటీ కమిషనర్ విలీనం అయిన ఏ మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ రికార్డులను స్వాధీనం చేసుకోవాలనేది అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన బాధ్యతలను డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ (డీఎంసీ)లకు బాధ్యతలు అప్పగించారు.