ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజీపూర్ జిల్లాలోని డెలియా గ్రామంలో ఓ కొడుకు తన తల్లి, తండ్రి, సోదరిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాద సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రాంతాన్ని భయాందోళనకు గురిచేసింది. నిందితుడిని అభయ్ యాదవ్‌గా గుర్తించారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
జిల్లా ఎస్పీ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని కేసును ధృవీకరించారు. మృతులను శివరామ్ యాదవ్, అతని భార్య, కుమార్తెగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. పొదల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను కనుగొన్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. శివరామ్ యాదవ్ తన భూమిలో కొంత భాగాన్ని తన కుమార్తెకు బదిలీ చేశాడు. దీనికి అతడి కుమారుడు అభయ్ అడ్డు చెప్పాడు. ఈ శనివారం తీవ్ర మలుపు తిరిగింది.
READ MORE: Varun Sandesh : వరుణ్ సందేశ్ కొత్త మూవీ స్టార్ట్..
అభయ్ యాదవ్ వివాహం చేసుకుని తల్లిదండ్రుల నుంచి విడిగా ఉంటున్నాడు. అతని సోదరి వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఉంటూ వారికి సేవ చేసింది. ఇది అభయ్ కు నచ్చలేదు. తండ్రి ఆమెకు భూమిలో భాగం సైతం రాసి ఇచ్చాడు. ఈ అంశంపై తాజాగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భూమి ఇచ్చేదే లేదని అభయ్ అడ్డుపడ్డాడు. ఈ విషయంలో తల్లిదండ్రులతో సహా సోదరిని చంపేశాడు. ఈ దారుణమైన నేరాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గ్రామస్థులను నుంచి సమాచారం సేకరిస్తున్నారు.