NTV Telugu Site icon

Dr. Gedala Srinubabu : ఆధునిక లాభసాటి వ్యవ‌సాయం వైపు `సాగు`దాం

Srinu

Srinu

డిజిట‌ల్ సీడ్స్‌తో అగ్రిప్రెన్యూర్ షిప్ సాధ్యం అవుతుంద‌ని ప‌ల్స‌స్ సీఈవో డా. గేదెల శ్రీనుబాబు ఆశాభావం వ్య‌క్తం చేశారు. శ్రీకాకుళంలో వేలాది మంది రైతుల‌తో జ‌రిగిన స‌మావేశంలో `విజన్ ఫర్ అగ్రిప్రెన్యూర్‌షిప్ ఇన్ నార్త్ ఆంధ్ర`ని శ్రీనుబాబు ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా గేదెల శ్రీనుబాబు వ్యవసాయరంగంలో అగ్రిప్రెన్యూర్‌షిప్ , డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేష‌న్ గురించి వివ‌రించారు. సంప్ర‌దాయ వ్య‌వ‌సాయం క‌నుమ‌రుగ‌వుతున్న ద‌శ‌లో, రైతులు త‌మ క్షేత్రాల‌ను వీడుతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అన్న‌పూర్ణ‌గా పేరుగాంచిన‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగువిస్తీర్ణం త‌గ్గ‌డం ప్ర‌మాద సంకేతం అని చెప్పారు. వ్యవసాయాన్ని లాభ‌సాటి చేయ‌డానికి, ప్ర‌తి ఇంటా లాభాల పంట పండించ‌డానికి వ్య‌వ‌సాయానికి డిజిట‌ల్ మార్కెటింగ్ అనుసంధాన‌మే అస‌లు సిస‌లు ప‌రిష్కారం అని చెప్పారు.

 

అగ్రిక‌ల్చ‌ర్ నుంచి బిజినెస్ క‌ల్చ‌ర్ వైపు..

ఆరుగాలం క‌ష్టించి ప‌నిచేసే రైతుని ఉద్దేశించి బుర‌ద బుక్కి బువ్వ పెడ‌తాడంటారు. అన్న‌దాత అని కొనియాడుతారు. కానీ సంప్ర‌దాయ వ్య‌వ‌సాయం, యాంత్రీక‌ర‌ణ‌కి చొర‌వ లేక‌పోవ‌డం, అందివ‌చ్చిన డిజిట‌ల్ కాలంలో ప్ర‌పంచం ఒక కుగ్రామం అయినా మార్కెటింగ్ సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో రైతులు వ్య‌వ‌సాయాన్ని వీడుతున్నారు. అగ్రిక‌ల్చ‌ర్‌ని వీడ‌కుండా అక్క‌డి నుంచే బిజినెస్ క‌ల్చ‌ర్ వైపు రైతుల్ని ప‌రివ‌ర్త‌న చేయ‌డం ద్వారా “వ్యవసాయ విప్లవం సాధ్యం అవుతుంద‌న్నారు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యవసాయాన్ని అగ్రిప్రెన్యూర్‌షిప్‌గా మార్చ‌డానికి అవ‌స‌ర‌మైన‌ రోడ్‌మ్యాప్‌ను శ్రీకాకుళంలో వేదికగా ప‌ల్స‌స్ సీఈవో ఆవిష్క‌రించారు.

 

డిజిటల్ సీడ్స్:
అగ్రిబిజినెస్‌లో డిజిటల్ మార్కెటింగ్ దే కీల‌క‌పాత్ర అని శ్రీనుబాబు వివ‌రించారు. విత్త‌నాలు వేసి పంట‌లు పండించే రైతులు, ఇక‌పై డిజిట‌ల్ విత్త‌నాలు వేయ‌డం ద్వారా లాభాల పంట‌లు పండించుకోవ‌చ్చ‌న్నారు. డిజిట‌ల్ విత్త‌నాలు అంటే నాటేవి కాద‌ని, వ్య‌వ‌సాయానికి డిజిట‌ల్ టెక్నాల‌జీ, డిజిట‌ల్ మార్కెటింగ్‌ని అనుసంధానించ‌డ‌మేన‌న్నారు. ప్రతి రైతు పారిశ్రామికవేత్త స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని, ఈ విప్ల‌వానికి శ్రీకాకుళంలో శ్రీకారం చుట్టామ‌ని, ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌టా విస్త‌రిస్తే వ్య‌వ‌సాయ విప్ల‌వం వ‌చ్చి నూత‌న శ‌కానికి నాంది ప‌లుకుతుంద‌న్నారు.

అగ్రిప్రెన్యూర్ షిప్ కోసం తాము త‌ల‌పెట్టిన రైతు సాధికారత యాత్రలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో జ‌రిగాయ‌ని..తెలిపారు. తాను ఆవిష్క‌రించిన విజ‌న్ డాక్యుమెంట్‌ని ప‌దివేల మందికి పైగా రైతుల‌కు చేర‌వేశామ‌న్నారు. శ్రీకాకుళం స‌భ‌లో రైతులు, వారి కుటుంబాలు వేలాదిమంది హాజ‌రై భ‌విష్య‌త్ వ్య‌వ‌సాయ‌రంగాన్ని లాభ‌సాటిగా మార్చుకునే ప్ర‌ణాళిక‌లు పాటిస్తామ‌న్నారు.