Site icon NTV Telugu

Hamas: కాల్పులపై హమాస్ కొత్త ప్రతిపాదన! వర్క్‌వుట్ అయితే మాత్రం..!

Hamas War Break

Hamas War Break

ఇజ్రాయెల్‌-హమాస్‌ల (israel hamas) మధ్య గత కొంత కాలంగా జరుగుతున్న యుద్ధంతో రక్తపుటేరులు పారుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఇంకొందరు చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నారు. ఇక గాజా అయితే పూర్తిగా నేలమట్టమైపోయింది. ప్రజలైతే ప్రాణ భయంతో తలోదారి వెళ్లిపోయారు. అప్పటికే ఇరు దేశాల మధ్య ప్రశాంతత కరవు అయింది. అయితే తాజాగా హమాస్ (Hamas) ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఇది వర్క్‌వుట్ అయితే కొంతకాలం ప్రజలు ప్రశాంతంగా జీవించొచ్చు.

ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య సుదీర్ఘకాలం కాల్పుల విరమణకు ఓ ప్రతిపాదనను హమాస్ తెరపైకి వచ్చింది. దీనికి ఆమోదముద్ర పడితే మూడు దశల్లో అమలుకానుంది. ఈమేరకు ఓ ప్రతిపాదనను హమాస్‌ నాయకులు ఖతర్‌, ఈజిప్ట్‌లోని మధ్యవర్తుల బృందానికి పంపారు.

గతంలో ఇజ్రాయెల్‌ పంపిన ప్రతిపాదనకు బదులు హమాస్‌ ఈ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చింది. ఒక్కో దశ 45 రోజులు చొప్పున.. మూడు దశల్లో ఇది అమలవుతుంది. ఈ ప్రతిపాదన ప్రకారం పాలస్తీనా ఖైదీలకు బదులుగా మిగిలిన ఇజ్రాయెల్‌ బందీలను విడుదల చేసే అంశం కూడా ఉంది.

అంతేకాదు గాజా పునర్నిర్మాణం, ఇజ్రాయెల్‌ దళాల ఉపసంహరణ, మృతదేహాల మార్పిడి వంటి అంశాలను హమాస్‌ ప్రతిపాదించింది. ఇజ్రాయెల్‌కు చెందిన మహిళలు, 19 ఏళ్ల లోపు వారిని, అనారోగ్యం పాలైన వృద్ధులను తొలి 45 రోజుల్లో హమాస్‌ విడుదల చేయాల్సిఉంది. దీనికి బదులుగా పాలస్తీనా మహిళలు, చిన్నారులను జైళ్ల నుంచి ఇజ్రాయెల్‌ విడుదల చేస్తుంది. మిగిలిన బందీలను రెండో దశలో, దాడుల్లో మరణించిన వారి మృతదేహాలను మూడో దశలో పరస్పరం అప్పగించుకోవాలి.

ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య ఈ ఒప్పందం జరిగితే యుద్ధాన్ని ముగించవచ్చని హమాస్‌ ఆశాభావంతో ఉంది. ఇరువురి ఒప్పందం జరిగితే మాత్రం పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంది. హమాస్ ప్రతిపాదనను నిశితంగా ఇజ్రాయెల్ పరిశీలిస్తోందని అధికారులు తెలిపారు. ఇదే అంశంపై ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలో వివరాలు వెల్లడించనున్నారు.

Exit mobile version