Gautam Gambhir promise Abhimanyu Eswaran: అభిమన్యు ఈశ్వరన్.. ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా ఎక్కువ వినిపించిన పేరు. ఐదు టెస్టులలో ఒక్కటి ఆడకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం అతడి పేరు మార్మోగిపోయింది. ఇందుకు కారణం.. 2022 నుంచి టీమిండియా స్క్వాడ్‌లో ఉంటున్నా ప్లేయింగ్ 11లో మాత్రం చోటు దక్కలేదు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా ‘ఇంకా ఎన్నేళ్లు వెయిట్ చేయాలి’ అంటూ అభిమన్యు సహా అతడి తండ్రి కూడా అసహనం వ్యక్తం చేశారు. కరుణ్ నాయర్ విఫలమవుతున్నా అవకాశాలు ఇస్తున్నారని, తన కుమారుడిని ఎందుకు పక్కన పెడుతున్నారని అభిమన్యు తండ్రి రంగనాథన్ ఆరోపించారు. తాజాగా మరోసారి ఆయన తన కొడుకు అరంగేట్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి తన కుమారుడికి హామీ లభించిందని రంగనాథన్ ఈశ్వరన్ చెప్పారు. ‘నా కుమారుడితో కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడారు. సరైన దారిలోనే ఉన్నావని, తప్పకుండా భారత జట్టుకు ఆడే అవకాశం వస్తుందని హామీ ఇచ్చారు. టెస్ట్ ప్రయాణం సుదీర్ఘంగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. 1-2 మ్యాచులకే బయటకు పంపించే వ్యక్తిని తాను కాదని, అవకాశాలు ఇస్తాము అని గంభీర్ నా కుమారుడికి సెప్పరూ. ఆ విషయాలను అభిమన్యు నాతో పంచుకున్నాడు. గత నాలుగేళ్లుగా నా కుమారుడు అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఛాన్స్ ఇస్తే తప్పకుండా రాణిస్తాడు’ అని అభిమన్యు తండ్రి రంగనాథన్ చెప్పారు. పచ్చిక ఎక్కువ ఉన్న పిచ్‌లపై అభిమన్యు బాగా ఆడతాడని, గ్రీన్ ట్రాక్ ఉండే ఈడెన్ గార్డెన్స్‌లో బాగా అనుభవం ఉందన్నారు. సాయి సుదర్శన్ ఆడిన వన్‌డౌన్‌లో అభిమన్యుఆడుంటే పరిస్థితి విభిన్నంగా ఉండేదన్నారు. ఇన్నింగ్స్‌ను సుదీర్ఘంగా తీసుకెళ్లగల సత్తా ఉన్న ప్లేయర్ అభిమన్యు అని రంగనాథన్ చెప్పుకొచ్చారు.
Also Read: Dhruv Jurel: కెప్టెన్‌గా ధ్రువ్ జురెల్.. రాజస్థాన్ రాయల్స్ పోస్ట్ వైరల్!
అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్ క్లాస్ కెరీర్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు 103 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 48.70 సగటుతో 7841 పరుగులు చేశాడు. 27 శతకాలు, 31 అర్ధ శతకాలు బాదాడు. 89 లిస్ట్-ఎ మ్యాచ్‌లలో 47.03 సగటుతో 3857 రన్స్ చేశాడు. ఇందులో 9 శతకాలు, 23 అర్ధ శతకాలు ఉన్నాయి. 34 టీ20 మ్యాచ్‌లలో 37.53 సగటుతో 973 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌లో 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు బాదాడు. అభిమన్యు 2022లో భారత టెస్ట్ జట్టులోకి వచ్చినా.. ఇప్పటివరకు అరంగేట్రంకు నోచుకోలేదు. అభిమన్యు తర్వాత వచ్చిన 16 మంది ప్లేయర్స్ కెరీర్‌ను ప్రారంభించడం విశేషం. కోచ్ గౌతమ్ గంభీర్ తన మాట నిలబెట్టుకుంటారో చూడాలి.
