NTV Telugu Site icon

Gas Cylinder: మోడీ వచ్చాక పెరిగిన ధర ఎంతో తెలుసా?

గత కొద్దిరోజులుగా గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశానికి నిచ్చెన వేశాయి. పెట్రోల్‌, నిత్యావసరాల ధరల మంటతో అల్లాడుతున్న సామాన్యుల నెత్తిన కేంద్రం మరో పిడుగు వేసింది. ఇంట్లో వాడే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 50 ధర పెంచింది. ఈ ధరలు నిన్నటినుంచే అమల్లోకి వచ్చినట్టు చమురు సంస్థలు తెలిపాయి. హైదరాబాద్‌లో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1,052కి చేరింది. ఆరువారాల వ్యవధిలో 14 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌పై ధరలు పెంచడం ఇది రెండోసారి. మార్చి 22న సిలిండర్‌పై రూ. 50 పెంచారు. దీంతో సిలిండర్ ధర పెరుగుదల సామాన్యుల పాలిట శాపంగా మారింది.

ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ. 102.50 పెంచింది. దీంతో హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్‌ ధర రికార్డుస్థాయిలో రూ. 2,562.5కు చేరింది. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు, కూరగాయల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుంటే ఎల్పీజీ ధరలను పెంచడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చమురుధరలకు తోడు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి బీజేపీ సర్కారు ప్రజలను పీడిస్తున్నదని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజలను, దేశాన్ని లూటీ చేయడం నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. అచ్చేదిన్‌ మళ్లీ తెచ్చినందుకు ధన్యవాదాలంటూ కేటీఆర్‌ వ్యంగ్యంగా ట్వీటేశారు.

2014 మే 26 నాటికి గ్యాస్ సిలిండర్ ధర రూ.410 వుండగా.. అది 8 ఏళ్ళకు 1052 రూపాయలకు చేరింది. గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో సామాన్యులు మళ్ళీ కట్టెల పొయ్యి వైపు అడుగులు వేస్తారని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.

BandiSanjay: ప్రశ్నిస్తే… మతతత్వవాదులంటారా?