NTV Telugu Site icon

Ganta Srinivasa Rao: చీపురుపల్లి నుంచి పోటీ చేయనని తప్పుకున్న గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలన్న టీడీపీ అధిష్ఠానం ప్రతిపాదనను దాదాపుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తిరస్కరించారు. ఆయన తన అయిష్టాన్ని ఇప్పటికే ప్రదర్శిస్తూ అధిష్ఠానం ముందు తన నిర్ణయాన్ని చెప్పినట్లు తెలిసింది. మరో ఒకట్రెండు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తాను చీపురుపల్లి వెళ్లబోవడం లేదనే విషయాన్ని చెప్పాలని గంటా శ్రీనివాసరావు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మిగతా ఆప్షన్ల గురించి టీడీపీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. సీనియర్ నేత కళా వెంకట్రావుతో పాటు విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరను కూడా అధిష్ఠానం పరిశీలిస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ ఊపుకు బ్రేకులు వేయాలనే ఆలోచనతో టీడీపీ అధిష్ఠానం సీనియర్‌ నేతలను బరిలో దింపాలని యోచించింది. కానీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తాను పోటీ చేయనని కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో..ఇప్పుడు తరువాతి నిర్ణయం ఏంటనే ఉత్కంఠ మొదలైంది.

Read Also: Vasantha Krishna Prasad: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లాలో గంటా కీలక నేతగా ఉన్నారు. టీడీపీ, ప్రజారాజ్యం తిరిగి టీడీపీ నుంచి గంటా వరుసగా గెలుస్తూ వచ్చారు. అనకాపల్లి ఎంపీగానూ పని చేసారు. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేయగా కొద్ది రోజుల క్రితం ఆమోదించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో గంటా కు సీటు దక్కలేదు. గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సపై పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. తనకు విశాఖ నుంచే అవకాశం ఇవ్వాలని గంటా కోరారు. ఫస్ట్ లిస్టు ప్రకటన తరువాత చంద్రబాబుతో గంటా సమావేశమయ్యారు. గంటాను బొత్సా పైన పోటీ చేయాలని..అక్కడ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. గెలిస్తే విజయనగరం జిల్లా నుంచి మంత్రిగా అవకాశం ఉంటుందని హామీ ఇచ్చినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. అయితే, దీని పైన ఇప్పుడు గంటా స్పష్టత ఇచ్చారు. తాను చీపురుపల్లి నుంచి పోటీ చేయలేనని చెప్పినట్లు సమాచారం. విశాఖ జిల్లా పరిధిలోనే తనకు సీటు ఇవ్వాలని మరోసారి కోరారు.

 

Show comments