Gandhi Jayanti: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాపూఘాట్‌కు చేరుకుని గాంధీజీకి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనల్లో గవర్నర్, సీఎం పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజహరుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, రామచంద్రనాయక్, పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరై నివాళులర్పించారు.
మరోవైపు, జాతిపిత మహాత్మా గాంధీతో పాటు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ఆ మహనీయులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, సికింద్రాబాద్ చిలకలగూడ పరిధిలో నిర్వహించిన ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా చీపురు పట్టి రోడ్లను ఊడుస్తూ పరిసరాలను శుభ్రం చేశారు.

