Durga Puja: దేశవ్యాప్తంగా దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. మహాత్మా గాంధీని అసురుడిగా చూపిస్తూ కోల్కతాలోని కస్బాలో ఏర్పాటు చేసిన దుర్గా మండపంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గా మాత వధించిన అసురుడి ముఖం.. గుండ్రటి కళ్లద్దాలతో బాపూను తలపించింది. దీంతో అఖిల భారత హిందూ మహాసభ ఏర్పాటు చేసిన దుర్గాపూజ పండల్ పై దుమారం రేగింది. మహాత్మా గాంధీని అసురునిగా చూపించిన విషయం తెలియగానే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పూజ మండపం వద్దకు హడావిడిగా చేరుకుంది. విగ్రహాన్ని మార్చాలని లేదా విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని ఆదేశాలను జారీ చేసింది. పోలీసులు, పరిపాలన అధికారుల ఒత్తిడితోనే పూజ నిర్వాహకులు గాంధీ వేషంలో తయారు చేసిన విగ్రహాన్ని మార్చడంతో వివాదం సద్దుమణిగింది.
ఆదివారం గాంధీజయంతి సందర్భంగా అఖిల భారత హిందూ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా వేదిక వద్దకు పోలీసులు, పరిపాలన అధికారులు చేరుకున్నారు. మహాత్మాగాంధీ విగ్రహాన్ని మహిషాసురునిగా చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహాన్ని మార్చాలని లేదా విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని నిర్వాహకులను పోలీసులు కోరారు. అలాంటి విగ్రహం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఇదే విషయంపై పోలీసులకు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం నిర్వాహకులు గాంధీ విగ్రహం బదులు మహిషాసురుడిని ఏర్పాటు చేశారు. అయితే ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని అఖిల భారత హిందూ మహాసభ పశ్చిమ బెంగాల్ యూనిట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూడ్ గోస్వామి అన్నారు.
Read Also: Tamil Nadu: చేపలకని వల వేశారు.. మత్స్యకారులకు ఊహించని షాక్
గాంధీ జీని అసుర రూపంలో చూపించడంపై రాజకీయ వివాదం తలెత్తింది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ ఘాటుగా స్పందించారు. అసభ్యత హద్దు మీరిపోయిందని అన్నారు. దీంతో బీజేపీ అసలు ముఖం బట్టబయలైంది. ఇది డ్రామా. మహాత్మాగాంధీ జాతిపిత అని, ఆయన భావజాలాన్ని ప్రపంచం మొత్తం గౌరవిస్తోందన్నారు.