Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాలాను ఆక్రమించి కేవలం 50 గజాల చిన్న స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. కూలిపోయిన భవన శిథిలాల నుంచి హైడ్రా (HYDRAA) సిబ్బంది రెండు మృతదేహాలను బయటకు తీశారు. ఘటనాస్థలిలో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో ‘విక్టిమ్ లొకేషన్ సిస్టమ్’ అనే అధునాతన టెక్నాలజీ ద్వారా పైప్‌లైన్, కెమెరాలను లోపలికి పంపి గాలిస్తున్నారు. బయటకు తీసిన మృతదేహాల్లో ఒకరి వద్ద టెస్టర్లు, కటింగ్ ప్లేయర్ వంటి పరికరాలు లభించడంతో అతను ఎలక్ట్రీషియన్ అయి ఉంటాడని, దానికి కేవలం రెండడుగుల దూరంలోనే మరొకరి మృతదేహం లభించడంతో అతను ఎలక్ట్రీషియన్‌కు సహాయకుడిగా (హెల్పర్) వచ్చిన కార్మికుడని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే వారి పేర్లు, వివరాలు ఇంకా ఐడెంటిఫై కావాల్సి ఉంది.
ఈ ప్రమాదానికి బిల్డింగ్ ఓనర్‌తో పాటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని స్పష్టమవుతోంది. గచ్చిబౌలి, అంజయ్య నగర్ ప్రాంతం హాస్టల్స్, పీజీలు, కో-లివింగ్ స్పేస్‌లకు ఒక అడ్డాగా మారిపోయింది. గతంలో సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ఉన్న కుటుంబాలను ఖాళీ చేయించి మరీ భవనాలను హాస్టళ్లుగా మార్చి అద్దెకు ఇస్తున్నారు. ఇదే క్రమంలో ఈ స్థలం ఓనర్ ఖాజా అనే వ్యక్తి, తాను నివాసం ఉండేది కాదు కదా, అద్దెకు ఇచ్చి డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కాంట్రాక్టర్ కూడా లాభాల కోసం 50 గజాల స్థలంలో ఏకంగా ఏడు ఫ్లోర్లు నిర్మించడానికి పూనుకున్నాడు. నాలాను ఆక్రమించి కడుతున్న భవనానికి పటిష్టమైన పునాది (బేస్మెంట్), పిల్లర్స్ వేయడానికి అవకాశం లేకపోయినా, అన్ని ఫ్లోర్ల భారాన్ని మోసే శక్తి ఆ పిల్లర్లకు లేదని తెలిసి కూడా నిర్మాణం చేపట్టారు.
ఇప్పటికే ఈ భవనానికి సంబంధించి ఏడు ఫ్లోర్ల స్లాబ్స్, ఫ్లోరింగ్ పనులు పూర్తయి కేవలం గోడల నిర్మాణం మాత్రమే మిగిలి ఉంది. ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి భవనం పూర్తిగా నేలమట్టమైంది. ఏ ఒక్క ఫ్లోర్ కూడా మిగలకుండా కూలిపోవడమే కాకుండా, పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై వరిగిపడింది. దీంతో ఆ అపార్ట్‌మెంట్‌లోని వెనుక వైపు ఉన్న 6 ఫ్లాట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఆ ఫ్లాట్ల కిచెన్ ఏరియాలు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో ప్రజలు వంట పూర్తి చేసుకుని హాలు, బెడ్‌రూమ్‌లలో ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ ఉదయం పూట వంట చేసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే తీవ్ర ప్రాణనష్టం జరిగి ఉండేది. కూలిన భవన శిథిలాలు ఆ ప్లాట్ల లోపల పడటంతో అపార్ట్‌మెంట్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. సంఘటనా స్థలంలో యజమాని గానీ, బిల్డర్ గానీ అందుబాటులో లేకపోవడంతో స్లాబ్ నిర్మాణం ఎప్పుడు జరిగింది, పనులు ఎప్పుడు ఆపేశారనే వివరాలు తెలిసే అవకాశం లేకుండా పోయింది. మొదటి నుంచి అక్కడ పనులు జరుగుతున్నట్లు గమనించకపోవడంతో కూలీలు ఎవరూ ఉండరని భావించారు. కానీ సెర్చ్ ఆపరేషన్‌లో ఇద్దరు మరణించినట్లు తేలింది.
ఇక ఈ అంశంపై పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు మాట్లాడుతూ.. తమ అపార్ట్‌మెంట్‌కు కేవలం అడుగు దూరంలో ఇంత ప్రమాదకరంగా భవనం నిర్మిస్తున్నారని, దీనివల్ల ప్రమాదం జరుగుతుందని బిల్డర్‌ను, యజమానిని పలుమార్లు హెచ్చరించినా వారు పట్టించుకోలేదని, వచ్చి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలాను ఆక్రమించి, నిబంధనలు ఉల్లంఘించి 50 గజాల స్థలంలో ఏడంతస్తులు నిర్మిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఎందుకు పట్టించుకోలేదని స్థానికులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో జెడ్+2 లేదా జెడ్+3 వరకు మాత్రమే పర్మిషన్ తీసుకుని, దానిపైన అదనంగా మరో 4 ఫ్లోర్లు వేసి జెడ్+7 వరకు నిర్మిస్తుంటారు. అంతటితో ఆగకుండా పెంట్‌హౌస్‌లు కూడా కట్టి కమర్షియల్‌గా హాస్టళ్లకు, పీజీలకు అద్దెకు ఇస్తున్నారు. ఈ భవన యజమాని కూడా రెసిడెన్షియల్ నిర్మాణం పేరుతో అనుమతి తీసుకుని, హాస్టల్ కోసం వాడేందుకు కమర్షియల్ భవనంగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు ఈ భవనానికి అసలు ఎన్ని ఫ్లోర్లకు అనుమతులు ఇచ్చారనే విషయమై వెరిఫై చేస్తున్నారు.

