Site icon NTV Telugu

Jammu and Kashmir: ఏప్రిల్ 1 నుంచి మహిళలకు ఉచితంగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణం

Jammu And Kashmir

Jammu And Kashmir

Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని మహిళలకు ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ రంగ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. మహిళలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు వారి మౌలిక స్వేచ్ఛను పెంచడం దీని లక్ష్యం. మార్చి 8న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో తన ప్రభుత్వ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఒమర్ అబ్దుల్లా ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చు తగ్గడమే కాకుండా, వారి దైనందిన జీవన విధానానికి సౌలభ్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉచిత ప్రయాణ సదుపాయం మహిళల ఆర్థిక భారం తగ్గించడంతో పాటు, వారికి మరింత స్వేచ్ఛ, అవకాశాలను అందించనుందని ఒమర్ అబ్దుల్లా అన్నారు.

Read Also: IML 2025 Final: ఫైనల్ చేరిన వెస్టిండీస్.. టైటిల్ కోసం భారత్తో అమితుమీ

ఈ నిర్ణయాన్ని జమ్మూ కశ్మీర్ మహిళలు హర్షిస్తున్నారు. ఉచిత ప్రయాణం ఆర్థికంగా కొంత ఊరట కలిగిస్తుందని పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడంలో నాణ్యత, భద్రతను తప్పకుండా కాపాడాలని మహిళలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే, 2011 జనాభా లెక్కల ప్రకారం, జమ్మూ కశ్మీర్‌లో మహిళల జనాభా 59 లక్షలు. ఇది గడిచిన 14 ఏళ్లలో మరింత పెరిగింది. అంతేకాదు, రాష్ట్రంలో మహిళా సాక్షరత శాతం కూడా పెరుగుతోంది. దీంతో ఉద్యోగాలు, విద్య కోసం మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

ఈ పథకం అమలుతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (SRTC), స్మార్ట్ సిటీ బస్సుల ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే,ఈ విషయంపై SRTC జనరల్ మేనేజర్ షౌకత్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆదాయ నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలానే, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ యాజమాన్యాలు కూడా తమ వ్యాపారంపై దీని ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Read Also: BRS: శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన..

మొత్తానికి సర్కారీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు ఖచ్చితంగా ప్రయోజనకరమైనదే. అయితే, దీని వల్ల ప్రభుత్వ రవాణా సంస్థలు, ప్రైవేట్ బస్సుల ఆదాయంపై ప్రభావం పడనుంది. ప్రభుత్వం తగిన ప్రణాళికతో ఆదాయ నష్టాన్ని భర్తీ చేస్తుందని సంబంధిత యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈ పథకం మహిళల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు, వారి భద్రతపై కూడా దృష్టి పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న ఈ ఉచిత ప్రయాణ విధానం ఎలా ప్రభావం చూపుతుందో చూడాలిమరి.

Exit mobile version