Site icon NTV Telugu

Parchur: ఓట్ల తొలగింపుపై ఈసీ సీరియస్.. ఎమ్మెల్యే ఫిర్యాదుతో అధికారులపై చర్యలు

Apec

Apec

Parchur: పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్‌ సీరియస్‌ అయ్యింది.. నలుగురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంది.. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఫిర్యాదుతో విచారణ జరిపిన ఎన్నికల కమిషన్‌.. బాపట్ల ఎస్పీ నివేదికతో చర్యలకు పూనుకుంది.. ఓట్ల తొలగింపులో ప్రమేయం ఉందని నిరూపితం కావడంతో.. మార్టూరు సీఐ, పర్చూరు, మార్టూరు, యద్దనపూడి ఎస్సైలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఈవో ముకేశ్ కుమార్ మీనా.. ఓట్ల తొలగింపులో ప్రమేయం ఉన్న బీఎల్ఓలు, మహిళా పోలీసులపైనా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.. ఆగస్టు నెలలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఎమ్మెల్యే సాంబశివరావు ఫిర్యాదు చేశారు.. ఇప్పుడు అధికారులపై తీసుకున్న చర్యలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు సీఈవో మీనా..

Read Also: Pooja Hegde : ఖరీదైన కారు కొన్న బుట్టబొమ్మ.. ధర ఎంతో తెలుసా?

కాగా.. పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు కుట్ర జరిగిందని.. ఈ కుట్రలో 189 మంది భాగస్వాములయ్యారని, 1,200 మంది సహాయ సహకారాలు అందించారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించిన విషయం విదితమే.. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, సీఈఓ, ఈఆర్వోలంతా బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారని.. ఈ కుట్రలో అధికారులూ భాగస్వాములే అని ఆయన దుయ్యబట్టిన విషయం విదితమే.. ఇక, ఏపీ వ్యాప్తంగా 2.45 లక్షల ఫారం-7 దరఖాస్తులు, 1.20 లక్షల కొత్త ఓటరు దరఖాస్తుల్ని చేయించారని.. ఒక్క పర్చూరు నియోజకవర్గంలో ఇలా 25 వేల మంది ఓట్లు తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని ఆయన ఆరోపించారు.. దీన్ని అడ్డుకోవాలని ఎన్నికల సంఘాన్ని పదేపదే కోరినా.. స్పందించడంలేదని విమర్శించారు.. ఇక, మార్టూరు, యద్దనపూడి, పర్చూరు మండలాల ఎస్సైలతోపాటు మార్టూరు సీఐ కూడా ఫారం-7 దరఖాస్తుల్ని పెట్టడంలో ఒత్తిడి తెచ్చారని సాక్ష్యాధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ఆయన మీడియాకు వివరించిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధితులపై చర్యలు తీసుకుంది.

Exit mobile version