NTV Telugu Site icon

VBIT College : విద్యార్థినుల ఫోటో మార్ఫింగ్ కేసు.. ఆ నలుగురే నిందితులు

Vbit College

Vbit College

VBIT College : ఘట్‌కేసర్‌ మండలంలోని వీబీఐటీ కాలేజ్‌ అమ్మాయిలపై వేధింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేధింపులకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు ప్రదీప్‌ను ఎట్టకేలకు పోలీసులు ట్రేస్‌ చేశారు. ప్రదీప్‌తో పాటు ఈ వ్యవహారంలో అతనికి సహకరించిన వారిని సైతం ఘట్‌కేసర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీ విజయవాడకు చెందిన ప్రదీప్‌.. వీబీఐటీ కాలేజీ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి.. న్యూడ్‌ ఫొటోలుగా మార్చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఈ క్రమంలో.. వాట్సాప్‌ డీపీలతో పాటు ఏకంగా ఫోన్‌ డాటా మొత్తాన్ని హ్యాక్‌ చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. సేకరించిన డాటాను డార్క్‌నెట్‌లో పెట్టి డబ్బు సంపాదించడంతో పాటు ఫేక్‌ ఫొటోల ద్వారా వాళ్లపై వేధింపులకు పాల్పడాలని ప్రదీప్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో వేధింపులను భరించలేక యువతులు విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ధర్నాకు దిగారు.. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు విద్యార్థినులకు మద్ధతుగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Read Also: Caucasian Shepherd Dog: రూ.100కోట్లు ఇచ్చినా ఆ కుక్కను అమ్మేదిలేదు.. అవన్నీ పుకార్లు

డీపీలను మార్ఫింగ్ చేసి వీబీఐటీ కాలేజీ విద్యార్థినీలను వేధింపులకు గురి చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను వేధించిన నలుగురు సైబర్ చీటర్స్‌‌ను అరెస్ట్‌ చేశామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మీడియాకు వెల్లడించారు. నిందితుల పేర్లు గణేష్, ప్రదీప్, సతీష్, దుర్గాప్రసాద్‌గా వెల్లడించారు. నిందితులు సోషల్‌మీడియాలో ప్రత్యేక గ్రూప్స్ ఏర్పాటు చేసి కాలేజీ విద్యార్థినులను వేధిస్తున్నారని తెలిపారు. నిందితులపై ఐపీసీ, ఐటీ, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని సీపీ చౌహాన్‌ తెలిపారు. కాగా వీబీఐటీ కాలేజీ ఘటనలో తొలుత ఫస్టియర్ విద్యార్థినిని నిందితుడు ప్రదీప్ ట్రాప్ చేశాడు. విద్యార్థిని ద్వారా ప్రదీప్ కాలేజీ గ్రూప్‌లో చేరాడు. ‘ఎంటర్ ద డ్రాగన్’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. లింకులను వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసి.. వాటి ద్వారా అమ్మాయిల ఫోన్లను కేటుగాళ్లు హ్యాక్‌ చేశారు. గ్రూప్‌లో అమ్మాయిల నెంబర్లు సేకరించి నిందితులు బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

Show comments