తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కొత్త భవనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఇవాళ (బుధవారం) శంకుస్థాపన చేయనున్నారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల విస్తీర్ణంలో నూతన హైకోర్టును నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. దీనికి రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. కాగా, లోక్‌సభ ఎలక్షన్ కోడ్ కారణంగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. సుప్రీంకోర్టు సీజే డీవై చంద్రచూడ్ సహా పలువురు సుప్రీం కోర్టు జడ్జీలు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, న్యాయమూర్తులు నేటి సాయంత్రం 5.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్, హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నారు.
Read Also: Congress Final List: నేడు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఫైనల్ జాబితా!
కాగా, హైకోర్టు నూతన భవనాన్ని వందేళ్ల పాటు పటిష్ఠంగా ఉండే విధంగా నిర్మించేలా ప్రణాళికలను రూపొందించారు. దాదాపు 1000 కోట్ల రూపాయలతో 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసే విధంగా ప్రణాళిక రెడీ చేశారు. ప్రస్తుతం హైకోర్టుకు కేటాయించిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా.. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కోర్టు హాళ్లను నిర్మించాల్సి ఉంది. జడ్జిల నివాస భవనాలతో పాటు రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు బార్ అసోసియేషన్, ఆడిటోరియం, లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఫైలింగ్ సెక్షన్‌లు, రికార్డుల గదులు, పార్కింగ్, తదితర అవసరాలకు తగిన విధంగా నిర్మాణాలు చేపట్టనున్నారు. కాగా, హైకోర్టు కొత్త భవనం వరకు మెట్రో రైలును కూడా ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.
