రాజమండ్రి (రాజమహేంద్రవరం) ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ‘అఖండ గోదావరి’ ప్రాజెక్ట్‌కు నేడు శంఖుస్థాపన జరగనుంది. గురువారం ఉదయం 10 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ తదితరులు.. ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో ఇకపై రాజమండ్రి పర్యాటక శోభను సంతరించుకోనుంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. రాజమండ్రి నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో 127 సంవత్సరాల రాజమండ్రి హేవలాక్ వంతెన, రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవు పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది. అలానే గోదావరి మధ్యలో 116.97 ఎకరాల్లో బ్రిడ్జిలంకను వినోద కేంద్రంగా మార్చనున్నారు. రూ.97 కోట్ల 44 లక్షల రూపాయలు అంచనాలతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఆరంభం అవుతోంది. బ్రిడ్జిలంకలో వినోదాత్మక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. బోటింగ్, క్రీడలు, రెస్టారెంట్స్, ధ్యాన మందిరం, ఆయుర్వేద కేంద్రాలు, ఈవెంట్ స్పేస్.. ఇంకా ఎన్నింటికో ప్రణాళికలు సిద్ధం చేశారు.
Also Read: Kanaka Durgamma: నేటి నుంచి ఇంద్రకిలాద్రిపై వారహి నవరాత్రులు, ఆషాఢ సారె సమర్పణ ఉత్సవాలు!
గోదావరి పుష్కరాల రేవును ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అక్కడ ఆధ్యాత్మిక, యోగా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా ఏడాదికి సగటున 18-20 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. స్థానికంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, ఇతర రంగాల ద్వారా 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా చారిత్రక నగరం రాజమండ్రి ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. నేటి శంఖుస్థాపన నేపథ్యంలో అధికారులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు.
