Site icon NTV Telugu

Tamil Nadu: లోక్సభ అభ్యర్థికి ‘చిలుక జోస్యం’.. వ్యక్తి అరెస్ట్.

Thamilnadu Arrest

Thamilnadu Arrest

లోక్‌సభ ఎన్నికలకు రెండో దశ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో.. తమిళనాడులోని కడలూరు లోక్‌సభ నియోజకవర్గం ప్రజల భవిష్యత్తును అంచనా వేస్తున్న చిలుక యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో ఉన్న.. కడలూరు పీఎంకే అభ్యర్థి తంగర్ బచ్చన్ ఓ చెట్టు కిందకు వచ్చి సేదతీరుతుండగా, చిలుక జోస్యుడు కనపడ్డాడు. దీంతో తనకు జోస్యం చెప్పమని అడిగారు. ఆ చిలుక జోస్యుడు బోనులో ఉన్న చిలుకను బయటకు రప్పించి అయ్యనార్‌ చిత్రపటం కలిగిన చిట్టాను చూపారు. అయ్యనార్‌ పటం రావటంతో ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారంటూ తంగర్‌బచ్చన్‌కు తెలిపారు. ఆ మాటలకు సంతోషించిన తంగర్‌బచ్చన్‌ ఆ చిలుక జోస్యుడికి చిల్లర ఇచ్చి వెళ్ళిపోయారు.

తంగర్‌బచ్చన్‌ చిలుక జోస్యం చూస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ క్రమంలో.. చిలుకను బందీగా ఉంచినందుకు దాని యజమాని సెల్వరాజ్‌ను అరెస్టు చేశారు. కాగా.. చిలుక యజమాని దానిని బందిఖానాలో ఉంచాడని అటవీశాఖ అధికారులు ఆరోపించారు. వన్యప్రాణి (రక్షణ) చట్టం, 1972 ప్రకారం చిలుకలను ‘షెడ్యూల్ II జాతులు’గా వర్గీకరించారని, వాటిని బందీలుగా ఉంచడం నేరమని ఫారెస్ట్ రేంజర్ జె. రమేష్ పేర్కొన్నారు. ఈ క్రమంలో.. చిలుక యజమానికి రూ. 10,000 వరకు జరిమానా, వార్నింగ్ ఇచ్చి సెల్వరాజ్‌ను వదిలిపెట్టనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.

తమిళనాడులోని కడలూరు లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. కడలూరు లోక్‌సభకు నామినేషన్ల ప్రక్రియ ముగియగా, ప్రస్తుతం ఓటింగ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ముందు అన్ని రాజకీయ పార్టీలు అట్టడుగు స్థాయిలో బలపడే పనిలో నిమగ్నమై ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేకు చెందిన టీఆర్‌వీఎస్ రమేష్ కడలూరు నుంచి పీఎంకే అభ్యర్థి డాక్టర్ ఆర్ గోవిందసామిపై దాదాపు రూ. 1.5 లక్షల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, పీఎంకే మధ్య పొత్తు ఉండడంతో పీఎంకే తన అభ్యర్థిగా తంగర్ బచ్చన్ ను ఎంపిక చేసింది. అదే సమయంలో కాంగ్రెస్‌-డీఎంకే ఇన్‌ ఇండియా పొత్తులో ఈ సీటు కాంగ్రెస్‌ ఖాతాలోకి రావడంతో ఆ పార్టీ ఎంకే విష్ణుప్రసాద్‌ను రంగంలోకి దింపింది.

Exit mobile version