Simona Halep: తన ఆటతో పాటు అందంతో అభిమానులను ఆకట్టుకున్న రొమేనియా టెన్నిస్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి సిమోనా హలెప్ డోపింగ్ టెస్టులో పట్టుబడింది. దీంతో అంతర్జాతీయ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజేన్సీ (ఐటీఐఏ) ఆమెపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. నిషేధిత ఉత్ర్పేరకాలు వాడినందుకు ఆమె కెరీర్ ప్రమాదంలో పడింది. ఈ ఏడాది న్యూయార్క్ లో జరిగిన యూఎస్ ఓపెన్ సమయంలో హలెప్ నుంచి సేకరించిన రెండు శాంపిల్స్ ను పరీక్షించి ఆమె డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు గుర్తించారు. ఆమె శాంపిల్స్ లో రోక్సాడుస్టాట్(ఎఫ్ జీ 4592) అనే డ్రగ్ ఉన్నట్టు తేలింది. కాగా 2022లో ఈ డ్రగ్ ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ నిషేధిత జాబితాలో ఉంది. ఈ క్రమంలోనే టెన్నిస్ యాంటీ డోపింగ్ ప్రోగ్రాం(టిఏడీపీ) ఆర్టికల్ 7.12.1 ప్రకారం హలెప్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు ఐటీఐఏ ధ్రువీకరించింది.
Read Also: Gold Rate Today : పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర
శాంపిల్ లో చాలా తక్కువ పరిణామంలో డ్రగ్ ఉండటంతో హలెప్ పై ప్రస్తుతానికి ప్రాధమిక నిషేధం మాత్రమే విధించారు. ఈ చర్యతో హలెప్ ఆశ్చర్యానికి గురైంది. ఇది తన జీవితంలో అతి పెద్ద షాక్ అని ఆమె పేర్కొంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పింది. తన కెరీర్ మొత్తంలో ఎప్పుడూ మోసం చేయాలనే ఆలోచన ఒక్కసారి కూడా రాలేదని తెలిపింది. నిషేధిత డ్రగ్ తన శరీరంలోకి ఎలా వెళ్లిందో తెలియడం లేదని చెప్పింది. తాను ఎలాంటి డ్రగ్ తీసుకోలేదని నిరూపించుకోవడానికి చివరి వరకూ న్యాయ పోరాటం చేస్తానని వెల్లడించింది.
Read Also: Dussehra: ‘దసరా’కు ‘పుష్ప’ జ్ఞాపకాలు.. సేమ్ టు సేమ్ అంటూ నెటిజన్ల కామెంట్స్
ఇక సిమోనా హలెప్ 2006లో ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మారింది. ఆమె ఖాతాలో రెండు టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో పాటు 24డబ్ల్యూటీఏ టూర్ టైటిల్స్ గెలుచుకుంది. 2017నుంచి 2019మధ్య హలెప్ రెండుసార్లు మహిళల టెన్నిస్ నెంబర్ వన్ క్రీడాకారిణిగా కొనసాగింది. రొమేనియా తరఫున ఈ ఘనత సాధించిన తొలి టెన్నిస్ ప్లేయర్. ఆమె కెరీర్లో 2018ఫ్రెంచ్ ఓపెన్, 2019లో వింబుల్డన్ గ్రాండ్ స్లమ్ టైటిల్స్ సాధించింది.