NTV Telugu Site icon

Bhumana Karunakar: అందుకే తొక్కసలాట జరిగింది.. టీటీడీ మాజీ ఛైర్మన్ తీవ్ర వ్యాఖ్యలు..

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా, స్విమ్స్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ వైఫల్యం.. 

ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది. చిత్తశుద్ధిలేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చారు. టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చారు. భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారు. ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను, టీటీడీని వాడుకున్నారు. గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. మరి ఇప్పుడు ఎందుకు జరిగింది? శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు తొక్కసలాటకు గురికావడం, అందులో మరణించడం సాధారణమైన విషయం కాదు. టీటీడీ చరిత్రలో ఇదొక చీకటిరోజు. చంద్రబాబుగారి ప్రభుత్వం ఈ పాపం మూటగట్టుకుంది. ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప ఆయనకు ఏమీ పట్టవు. గోదావరిలో పుష్కరాల తొక్కిసలాట ఘటన ఇప్పటికీ మనకు చేదు జ్ఞాపకమే. హిందూ ధర్మంమీద భక్తి, శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేకనే ఇలాంటి ఘటనలు. భక్తులకు అందించే సేవలు అత్యంత పవిత్రమైనవి, వాటిని తేలిగ్గా చూడ్డంవల్లే ఇలాంటి ఘటనలు. పరమపవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు దర్శనానికి లక్షలాదిమంది వస్తారని అందరికీ తెలుసు. తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారు?” అని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు.

టీవీ కార్యాలయాలను తిరుమల టిక్కెట్ల విక్రయ కేంద్రాలుగా మార్చారన్న ఆరోపణలు..

తిరుపతిలో పోలీసు అధికారుల దృష్టి అంతా రాజకీయంగా కక్ష తీర్చుకునే కేసులపైనే ఉందని భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. వైయస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంపైనే వారి దృష్టి.. తిరుపతి ఎస్పీ టీడీపీ కార్యకర్తగా మారి భక్తుల రక్షణ బాధ్యతలను పట్టించుకోలేదు. అధికారుల మధ్య, పోలీసుల మధ్య సమన్వయం లేదు. శ్రీవారి భక్తుల సేవకన్నా, టీటీడీ ఛైర్మన్‌కు రాజకీయ వ్యాఖ్యానాలే ఎక్కువ. ఆయన పనంతా రాజకీయ దుష్ప్రచారం చేయడమే. టీటీడీ ఛైర్మన్‌ తన టీవీ కార్యాలయాలను తిరుమల టిక్కెట్ల విక్రయ కేంద్రాలుగా మార్చారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. తొక్కిసలాట ఘటనపై వెంటనే విచారణ జరగాలి. టీటీడీ ఛైర్మన్‌ సహా, స్థానిక ఎస్పీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలి. అసమర్థ పరిపాలన అందిస్తున్న చంద్రబాబు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలి.” అని డిమాండ్ చేశారు.

 

Show comments