NTV Telugu Site icon

Grandhi Srinivas Resigns: దెబ్బ మీద దెబ్బ..! వైసీపీకి మరో షాక్‌.. అవంతి బాటలో గ్రంధి..

Grandhi Srinivas

Grandhi Srinivas

Grandhi Srinivas Resigns: ఏపీలో వైఎస్‌ జగన్‌ అధికారం కోల్పోయిన తర్వాత.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలు.. ఇలా చాలా మంది వైసీపీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీ, జనసేన, బీజేపీలో చేరిపోయారు.. ఇక, తాజాగా, మాజీ మంత్రి, వైసీపీలో కీలక నేతగా ఉన్న అవంతి శ్రీనివాస్‌ కూడా వైసీపీని వీడారు.. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను.. అందుకే భీమిలి నియోజకవర్గం ఇంఛార్జ్‌ బాధ్యతలను మరియు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ అవంతి రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు పంపారు.. ఇప్పుడు ఆయన బాటలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ కూడా వెళ్తున్నారు.

Read Also: Zebra OTT: ఓటీటీలోకి సత్యదేవ్‌ ‘జీబ్రా’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

మొత్తంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పార్టీని వీడెందుకు సిద్ధమయ్యారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉండే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.. 2024 ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు గ్రంధి శ్రీనివాస్.. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే, టీడీపీ నుంచి సానుకూల స్పందన రాలేదు. ప్రస్తుతం వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గ్రంధి.. రాజీనామా చేశారు.. ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంపై త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు. గ్రంధి శ్రీనివాస్ పార్టీలో కొనసాగాలంటూ గతంలో మాజీ మంత్రులు పేర్ని నాని, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ మంతనాలు జరిపారు. అయినా, వెనక్కి తగ్గని గ్రంధి శ్రీనివాస్.. వైసీపీని వీడేందుకు సిద్ధమై రాజీనామా చేశారు.. కాగా, 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గ్రంధి శ్రీనివాస్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడించిన విషయం విదితమే.. పార్టీలో జెయింట్ కిల్లర్‌గా గుర్తింపు పొందిన ఆయన.. కొంతకాలంగా పార్టీ అగ్రనాయకత్వంపై అసహనంతో ఉన్నారట.. అందుకే పార్టీకి గుడ్‌బై చెప్పారని చెబుతున్నారు..