NTV Telugu Site icon

Ravela Kishore Babu: వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. చంద్రబాబుపై ప్రశంసలు..

Ravela Kishore Babu

Ravela Kishore Babu

Ravela Kishore Babu: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గ్రాండ్‌ విక్టరీ కొట్టగా.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాన్ని ముఠగట్టుకుంది.. అయితే, ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పని చేసిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. ఇక, పనిలో పనిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు రావెల కిషోర్‌బాబు..

తాను డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలకు కట్టుబడి పనిచేసాను అన్నారు రావెల.. 2014లో నాకు చంద్రబాబు నాయుడు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు.. 2014 ఏపీలో తొలి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసేందుకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న మాటలు నమ్మి తాను వైసీపీలో చేరాను అన్నారు. కానీ, ఈ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు వైఎస్‌ జగన్ ని తిరస్కరించారని తెలిపారు.. ఈ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే నారా చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందన్నారు. ఇక, తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అఖండ విజయం ఇచ్చారని ప్రశంసించారు.

మరోవైపు, మందా క్రిష్ణ మాదిగ నలబై ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆ అంశం ముగింపు కు వచ్చిందని భావిస్తున్నాను అన్నారు రావెల… ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు ఇద్దరూ వర్గీకరణకు మద్దత్తు తెలిపారు. అందుకే నేను వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని స్పష్టం చేశారు. నా ఉద్యమాన్ని సామాజిక సేవను ముందుకు తీసుకెళ్లానని ప్రకటించారు.. వర్గీకరణ అంశం నెరవేరే దాకా పనిచేస్తూ.. దానికి అనుకూలంగా ఉన్న పార్టీలో చేరే విషయాన్ని ఆలోచిస్తానని తెలిపారు మాజీ మంత్రి, వైసీపీ నేత రావెల కిషోర్‌బాబు.

కాగా, 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.. అయితే, 2019 ఎన్నికల ముందు జనసేనలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బీజేపీలో చేరారు.. ఆ తర్వాత ఆ పార్టీకి కూడా రాజీనామా చేసిన ఆయన.. కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.. కొంత కాలం తర్వాత బీఆర్ఎస్‌కు బైబై చెప్పి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. ఇప్పుడు వైసీపీ గుడ్‌బై చెప్పేశారు రావెల కిషోర్‌బాబు.