NTV Telugu Site icon

Balineni Srinivasa Reddy: మళ్లీ అలిగిన బాలినేని… సీఎం జగన్‌ బుజ్జగింపులు

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లా మార్కాపురం సీఎం జగన్ పర్యటనలో మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బాలినేనికి ప్రొటోకాల్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదు అధికారులు. మార్కాపురంలో సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్‌ వద్దకు వెళ్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి వాహనాలను అధికారులు అడ్డుకున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని… అక్కడి నుంచి వెళ్లిపోయారు. నచ్చజెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేశ్‌, జిల్లా ఎస్పీ, ఇతర నేతలు ప్రయత్నించినా బాలినేని శాంతించలేదు. సీఎం కార్యక్రమంలో పాల్గొనకుండానే తన అనుచరులతో ఆయన ఒంగోలుకు వెనుదిరిగారు. విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు సీఎంఓ అధికారులు. ముఖ్యమంత్రిని కలవాల్సిందిగా బాలినేనికి తెలిపారు.

Read Also: Botsa Satyanarayana: మా గురించి ఎందుకు..? మీ సంగతి చూసుకోండి..

అయితే మార్కాపురంలో ఈబీసీ నేస్తం సభ ప్రారంభమయ్యేసరికి.. అక్కడ వేదికపై కనిపించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. సీఎంవో అధికారుల సూచనతో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందుకు.. ఈబీసీ నేస్తం సభా వేదిక దగ్గరకు ఆయన వెళ్లారు. సభావేదిక పైకి బాలినేనిని పిలిపించి.. ఆయనతో ఈబీసీ నేస్తం డీబీటీ బటన్‌ను నొక్కించారు జగన్‌. కాగా, హెలిప్యాడ్‌ వద్ద బాలినేనినికి ఎదురైన ఘటన, ఆయన తిరిగి వెళ్లిన విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు సీఎంవో అధికారులు. దీంతో సీఎం కల్పించుకుని.. బాలినేనికి ఫోన్‌ చేసి బుజ్జగించారని, అందుకే ఆయన అలకవీడి మళ్లీ సభకు వచ్చారని సమాచారం. మొత్తానికి బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎం జగన్‌ బుజ్జగింపు అంశం రాజకీయంగా పలు రకాల చర్చకు దారితీసింది. మరోవైపు.. సీఎం వైఎస్ జగన్‌ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన బాలినేనికి.. జగన్‌ 2 కేబినెట్‌లో చోటు దక్కలేదు.. ఈ సమయంలోనూ ఆయన అలకబూనడం.. వైసీపీ అధిష్టానం, సీఎం జగన్‌ ఆయనకు నచ్చజెప్పిన విషయం విదితమే.