Graham Thorpe died by suicide confirms Wife Amanda: ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆగష్టు 5న అనారోగ్య సమస్యలతో థోర్ప్ చనిపోయారని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పేర్కొంది. అయితే థోర్ప్ అనారోగ్య కారణాలతో మరణించలేదని, ఆత్మహత్య చేసుకున్నారని ఆయన సతీమణి అమండా తాజాగా చెప్పారు. అనారోగ్య సమస్యలు తన కుటుంబానికి ఇబ్బందిగా మారాయని భావించి బలవన్మరణానికి పాల్పడ్డారని వెల్లడించారు.
గత శనివారం ఫర్న్‌హామ్ క్రికెట్ క్లబ్, చిప్‌స్టెడ్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు గ్రాహం థోర్ప్ జ్ఞాపకార్థం ఓ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకి థోర్ప్ భార్య అమండా.. కుమార్తెలు కిట్టి, ఎమ్మా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమండా మాట్లాడుతూ… ‘గత రెండేళ్లుగా థోర్ప్ తీవ్ర మానసిక సమస్యలతో బాధపడ్డారు. మే 2022లో ఆత్మహత్యకు ప్రయత్నించారు. దాంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చాలా రోజులు ఉండాల్సి వచ్చింది. తాను ఎంతగానో ప్రేమించే భార్య, కూతుళ్లు ఉన్నప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు. తన భార్య, పిల్లలు సుఖంగా ఉండాలని ఆత్మహత్య చేసుకున్నారు. చాలా బాధగా ఉంది’ అని చెప్పారు.
Also Read: Neeraj Chopra: భారత్‌కు రాకుండా.. జర్మనీ వెళ్లిన నీరజ్ చోప్రా! కారణం ఏంటంటే?
గ్రాహం థోర్ప్ 1993 నుంచి 2005 మధ్య ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 6744 రన్స్ చేశారు. ఇందులో 16 సెంచరీలు ఉండగా.. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 200 నాటౌట్. వన్డేల్లో 2380 పరుగులు బాదారు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన థోర్ప్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 341 మ్యాచ్‌ల్లో 21937 పరుగులు చేశారు. సర్రేతో ఆయన 17 ఏళ్ల కెరీర్‌ను కొనసాగించారు.