Cricket Player: తీవ్ర విషాదం.. అరుదైన వ్యాధితో మరణించిన క్రికెటర్..

Shapoor

Shapoor

అఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) ‘హెమోఫాగోసిటిక్ లింఫోహిస్టియోసైటోసిస్’ (HLH) అనే అరుదైన, ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా దిల్లీ-ఎన్‌సీఆర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) అధికారికంగా ధృవీకరించింది.

షాపూర్ జద్రాన్ మృతిపై ACB తీవ్ర దిగ్భ్రాంతిని, సెంతాపాన్ని వ్యక్తం చేసింది. అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు బలమైన పునాది వేసిన ఆటగాళ్లలో షాపూర్ ఒకరు. దేశంలో క్రికెట్ ఎదుగుదలకు ఆయన చూపిన నిబద్ధత, అభిరుచి ఎనలేనివి. మైదానంలో ఆయన పోరాట పటిమ, పట్టుదల భవిష్యత్ తరాల క్రికెటర్లకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.

“అఫ్గాన్ క్రికెట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో షాపూర్ పాత్ర మరవలేనిది. ఆయన చేసిన సేవలు అఫ్గాన్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి” అని ACB కొనియాడింది.

క్రికెట్ కెరీర్..
షాపూర్ జద్రాన్ 2009 నుండి 2020 వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో చురుగ్గా రాణించారు. వన్డేల్లో 44 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు పడగొట్టారు. టీ20ల్లో 36 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు సాధించారు.

ప్రాణాంతక వ్యాధి ‘HLH’ అంటే ఏమిటి?
ప్రధానంగా పిల్లలపై ప్రభావం చూపే ‘HLH’ అనేది మానవ రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా బలహీనపరిచే ఒక అరుదైన వ్యాధి. ఇందులో రోగనిరోధక వ్యవస్థ మితిమీరి స్పందించడం వల్ల శరీరంలో తీవ్రమైన వాపు వస్తుంది. ఇది బోన్ మ్యారో, కాలేయం, ప్లీహం, లింఫ్ నోడ్స్‌ వంటి శరీర కణజాలాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

గత ఏడాది అక్టోబర్‌లో షాపూర్ మొదటిసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అక్కడ వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఆయనను భారతదేశానికి తీసుకువచ్చారు. ప్రారంభంలో చికిత్సకు ఆయన శరీరం బాగానే సహకరించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. కానీ, దురదృష్టవశాత్తూ మళ్లీ సమస్య తిరగబెట్టడంతో పరిస్థితి విషమించి ఆయన ప్రాణాలు కోల్పోయారు. షాపూర్ మృతితో అఫ్గాన్ క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది.