NTV Telugu Site icon

Ford Layoff: ఫోర్డ్‌లో భారీగా ఉద్యోగాలు కట్..ఇంజినీర్ల విభాగంలోనే ఎక్కువ!

9

9

టెక్ సంస్థల్లో మొదలైన ఉద్యోగాల కోతలు ప్రతి ఇండస్ట్రీకి విస్తరిస్తున్నాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ కూడా ఇదే బాటలో వెళ్లనున్నట్లు ప్రకటించింది. వచ్చే మూడేళ్లలో ఐరోపాలో తమ సంస్థలోని 3,800 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు వెల్లడించింది. ఆర్థికంగా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో తమ కార్యకలాపాలను గాడిన పెట్టే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు విద్యుత్తు కార్ల విభాగంలో పోటీ ఎక్కువైన కారణంగా ఖర్చులను నియంత్రించుకోనున్నట్లు పేర్కొంది.

Also Read: HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు

జర్మనీలో 2,300 మందిని, యూకేలో 1,300 మందిని, ఐరోపాలోని మిగిలిన ప్రాంతాల్లో మరో 200 మందిని తొలగించనున్నట్లు ఫోర్డ్‌ తెలిపింది. 2035 నాటికి ఐరోపాలో పూర్తిగా విద్యుత్తు వాహనాలనే విక్రయించాలన్న తమ లక్ష్యాన్ని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాదిలోనే కంపెనీ ఐరోపాలో తయారు చేసిన తొలి విద్యుత్తు కారును విడుదల చేయనుంది. ఉద్యోగుల తొలగింపును వీలైనంత వరకు ‘వాలంటరీ సపరేషన్‌ ప్రోగ్రాం’ ద్వారా చేపడతామని తెలిపింది. క్రమంగా విద్యుత్తు వాహన తయారీ దిశగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో ఇంజినీర్ల సంఖ్య పెద్దగా అవసరం ఉండకపోవచ్చునని ఫోర్డ్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విభాగంలోనే దాదాపు 2,800 మంది తొలగించాలని యోచిస్తోంది. మిగిలిన 1,000 మందిని పరిపాలనా విభాగాల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్‌ విభాగంలో ఇంకా 3,400 మంది ఉంటారని సమాచారం. ఫోర్డ్‌కు ఐరోపాలో మొత్తం 34,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

Also Read: Spritual Tourism: దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధి