NTV Telugu Site icon

Supreme Court: బలవంతపు మతమార్పిళ్లు దేశభద్రతకే పెనుసవాల్.. కఠిన చర్యలు తీసుకోవాలి..

Supreme Court

Supreme Court

Supreme Court: బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇవి దేశభద్రతకు, మతస్వేచ్ఛకు పెనుసవాల్‌ అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. వీటిని అరికట్టేందుకు కేంద్రం చిత్తశుద్ధితో కృషిచేయాలని సుప్రీం ఆదేశించింది. బలవంతపు మత మార్పిళ్లను అడ్డుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ అడ్వకేట్‌ అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. బలవంతపు మతమార్పిడులను అడ్డుకునేందుకు కేంద్రం ఏం చేయనుందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ప్రశ్నించింది. ఈ అంశాన్ని రాజ్యాంగ పరిషత్తులో చర్చించినట్టు ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. చాలా సందర్భాల్లో మతమార్పిడి జరిగినట్టు బాధితులకూ తెలియదని, తమకేదో సాయం అందిస్తున్నారనే అభిప్రాయంతో ఉంటారని మెహతా పేర్కొన్నారు.

CJI Justice Chandrachud: జిల్లా న్యాయవ్యవస్థ రూపురేఖలు మారాలి..

విచారణ సందర్భంగా దేశంలో మత స్వేచ్ఛ ఉంది గానీ.. బలవంతంగా మతం మార్చడానికి స్వేచ్ఛ లేదని ధర్మాసనం పేర్కొంది. ‘రాజ్యాంగం ప్రకారం మత మార్పిడి చట్టబద్ధం. కానీ బలవంతపు మత మార్పిడి కాదు’ అని తెలిపింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా… ఇందుకు సంబంధించి మధ్యప్రదేశ్‌, ఒడిశా సహా కొన్ని రాష్ట్రాలు చట్టాలు చేశాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం, ఇతర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో 22లోగా తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 28వ తేదీకి వాయిదా వేసింది.