Bhadrachalam: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మరోసారి గోదావరి నదిలో వరద పోటెత్తుతోంది.. గత నెల 20వ తేదీ నుంచి గోదావరి దోబూచులాట ఆడుతోంది.. గోదావరిలో నీటిమట్టం భద్రాచలం వద్ద 44 అడుగులకు చేరుకుంది. దీంతో అప్పుడే భద్రాచలం రామాలయం చుట్టూ నీళ్లు చేరుతున్నాయి. స్లోయిస్ నుంచి నీళ్లు గోదావరిలోకి పోకపోవటంతో రామాలయం పడమర వైపు నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇవన్నీ అన్నదాన సత్రంలోకి ప్రవేశించాయి. అదేవిధంగా పడమర వైపు ఉన్న దుకాణాలు కూడా నీళ్లు వచ్చి చేరుకున్నాయి. నిన్నటి నుంచి భద్రాచలం పట్టణంలో భారీగా వర్షం కురుస్తుంది.. ఆ వర్షపు నీళ్లని గోదావరి కరకట్ట పక్కనే ఉన్న దగ్గరికి చేరుకుంటున్నాయి.
అయితే గోదావరికి 44 అడుగులు చేరుకోవడంతో స్లోయిస్ లన్ని కూడా మూసుకుంటున్నాయి.. దీంతో స్లోయిస్ నుంచి గోదావరిలకి నీళ్లు పోయే దారి లేకపోవడంతో రామాలయం వరద నీరు పేరుకొని పోతుంది. ఇక, ఈ నీటిని మోటార్లతో గోదావరి నదిలోకి చేరవేయడం నిరంతర ప్రక్రియ.. కానీ, ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం, అధికారులు నిర్లక్ష్యం వల్ల మోటార్లు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో వరద నీరంతా సత్రం వద్ద పేరుకుని పోయింది. ఇలా వరద నీరు పేర్కొనటంతో అన్నదాన సత్రంలోకి నీళ్లు రావడంతో ఆ సత్రాన్ని మూసివేయాల్సి వచ్చింది. అదేవిధంగా దుకాణ సముదాయంలోకి నీళ్లు రావడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక, అశ్వాపురం మండలంలో పొంగి ప్రవహిస్తున్నాయి లోతు వాగు, ఇసుక వాగు.. దీంతో.. గిరిజన గ్రామాలకు రాకపోకలకు బంద్ అయ్యాయి. మరోవైపు.. కిన్నెరసాని ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తింది.. దీంతో 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 402.80 అడుగులుగా ఉంది.. ఇన్ ఫ్లో 25,000 క్యూసెక్కులుగా ఉంటే.. 4 గేట్ల ద్వారా 25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.