Flood Relief Fund for Bhadradri Flood Victims.
భద్రాచలం వరద బాధితులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధ్వర్యంలో సహాయం అందజేశారు. కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం నుండి మూడు ఆదివాసి గ్రామాలకు నిత్యవసర సరుకులు వంట సామాగ్రి బట్టలు తదితర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. దుమ్ముగూడెం మండలం వర్క్ షాప్, ఎల్లన్న రావు పేట, రాగుపల్లి ఈ మూడు గ్రామాలకు 5 లక్షల రూపాయల విలువ గల వస్తువులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వరదల కారణంగా మూగజీవాలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, భద్రాచలం గోశాల, మరో రెండు గోశాలలు మొత్తం భద్రాచలంలోని మూడు గోశాలలకు పశుగ్రాసం వితరణ చేసేందుకు ఏర్పాటు చేసామని ఆయన వెల్లడించారు.
రేపు 30 ట్రాక్టర్ల ద్వారా మూడు గోశాలలకు పశుగ్రాసం పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. భారత సంస్కృతిలో భాగమైన గోమాతను కాపాడుకోవాల్సిన అవసరం అందరికి ఉందని, ముందు చూపుతో సీఎం కేసీఆర్ అప్రమత్తతో వ్యవహరించి భారీ వరదలు సంభవించినప్పటికీ ప్రాణ నష్టం లేకుండా చేశారన్నారు. వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం రెండు నెలలకు సరిపడా రేషన్‌ను సరఫరా చేస్తుందని ఆయన తెలిపారు. తీవ్ర వరదలకు అనేక కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయని, ఒక్కో కుటుంబానికి బట్టలు వంట సామాగ్రి వారికి కావాల్సిన అన్ని వస్తువులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.