Vijayawada: బెజవాడలో వరద తగ్గుముఖం పడుతోంది. బుడమేరు గండ్లు పూడ్చటంతో నగరంలో బుడమేరు వరద ఆగింది. బుడమేరు గండ్లు పూర్తిస్థాయిలో పూడ్చివేయడంతో పలు ప్రాంతాలు ముంపు నుంచి బయటపడుతున్నాయి. విజయవాడలోని కేఎల్ రావు నగర్, సాయిరాం సెంటర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో వరద నీరు భారీగా నిలిచింది. 7 రోజుల నుంచి విజయవాడ ప్రజలు వరద నీటిలోనే ఉన్నారు. వరద నీటితో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరద నీటిలోనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. షాపుల్లోకి భారీగా వరద నీరు చేరి తీవ్రంగా ఆస్తి నష్టం వచ్చిందని వ్యాపారులు వాపోతున్నారు. విజయవాడలో వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య పనులను వేగవంతం చేశారు. కాలనీల్లో పూడిక చెత్త, మట్టిని తొలగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అల్పపీడన ప్రభావంతో శనివారం మధ్యాహ్నం నుంచి విజయవాడలో ఎడతెరిపి లేకుండా ఓ మోస్తరు వర్షం కురుస్తోంది.
Read Also: Munneru River: మున్నేరుకు మరో వరద ముప్పు..! 16 అడుగులకు నీటిమట్టం..
మరోవైపు.. బుడమేరు కాలువలో కొట్టుకుపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణి కోసం గాలింపు చర్యలు ముమ్మరం అయ్యాయి. వరదనీటిలో చిక్కుకున్న కారును గుర్తించిన అధికారులు కారు బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కారులో ప్రయాణిస్తున్న ఫణి ఆచూకీ లభ్యంకాక పోవడంతో భారీగా ప్రవహిస్తున్న బుడమేరు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు .