NTV Telugu Site icon

Jogi Ramesh: పెనమలూరులో పొలిటికల్ ఫ్లెక్సీ వార్..! జోగి రమేష్‌ గెలవకూడదనే ఈ సీటు..?

Jogi Ramesh

Jogi Ramesh

Jogi Ramesh: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీట్ల మార్పులు, చేర్పులు చిచ్చు పెడుతున్నాయి. ఇక, పెడన అసెంబ్లీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న మంత్రి జోగి రమేష్‌ని పెనమలూరుకు మార్చింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం.. దీంతో.. పెనమలూరులో పొలిటికల్ ఫ్లెక్సీల వార్‌ నడుస్తోంది.. జోగి రమేష్‌పై పార్టీలో కుట్ర చేసి గెలవని పెనమలూరు సీట్ ఇచ్చారని భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. మరోవైపు.. నేడు మంత్రి జోగి రమేష్‌ పుట్టిన రోజు.. తన పుట్టిన రోజు సందర్భంగా నేడు కొత్త నియోజక వర్గం పెనమలూరులో పర్యటించేందుకు సిద్ధం అయ్యారు.. దీంతో.. మంత్రి జోగి రమేష్ పెనమలూరు తొలి విజిట్ టెన్షన్‌ పుట్టిస్తోంది.

Read Also: India-Maldives row: దానికి నేను హామీ ఇవ్వలేను.. భారత్-మాల్దీవుల వివాదంపై జైశంకర్ కామెంట్స్..

ఇక, జోగి రమేష్‌.. నాన్ లోకల్ అంటూ ఇప్పటికే పడమట సురేష్, తుమ్మల చంద్రశేఖర్ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు.. జోగి ఇంఛార్జి అవ్వగానే దళిత అధికారులను వేధిస్తున్నాడని వైసీపీ రాష్ట ఎస్సీ సెల్ కన్వీనర్ రాజీనామా చేయడం మరో వివాదానికి దారితీసినట్టు అయ్యింది.. అసమ్మతి రాగాల నడుమ జోగి రమేష్‌ తొలి పర్యటన ఎలా సాగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.. జోగికి బర్త్ డే విషెస్ చెబుతూనే రెండు సార్లు గెలిచిన పెడన సీటు ఇవ్వకుండా.. కుట్ర చేశారని కామెంట్స్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పెనమలూరులో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆ సీటు తమకే కేటాయించాలని కంకిపాడుకు చెందిన పడమట సురేష్‌బాబు, కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ తుమ్మల చంద్రశేఖర్‌లు ఇప్పటికే అధిష్ఠానానికి విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. ఇప్పుడు కంకిపాడు బస్టాండు ఆవరణలో కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి పరిచయాలు లేని వ్యక్తికి ఎలా కేటాయిస్తారు? అంటూ నిలదీస్తున్నారు. ఇక, పెనమలూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కొలుసు పార్థసారథి.. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.