Site icon NTV Telugu

Lok sabha: తొలిరోజు సందడిగా సాగిన పార్లమెంట్ సమావేశాలు

Mp

Mp

18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం సందడిగా ప్రారంభమయ్యాయి. ఎన్నికైన ఎంపీలతో పార్లమెంట్ పరిసరాలు ఉల్లాసంగా కనిపించాయి. ఒకరికొకరు పలకరించుకుంటూ సందడిగా కనిపించింది. ముందుగా ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ చేత రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, రాష్ట్రపతి ఛైర్మన్ హాజరయ్యారు.

ఇక లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ సీటులో.. ప్రొటెం స్పీకర్ భర్తృహరి ఆశీనులయ్యారు. అనంతరం ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణం చేయించారు. సోమ, మంగళవారాల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇక బుధవారం (జూన్ 26) లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది.

హిమాచల్‌ప్రదేశ్ మండీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సందడి చేశారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు పలువురు పోటీ పడ్డారు. ఇక కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలతో బీజేపీ ఎంపీలు పలకరింపులతో ఉల్లాసంగా సాగింది. ఇక రాహుల్ గాంధీ తన సహచర ఎంపీలతో ఫొటోలకు ఫోజులిచ్చారు.

ఇక ఈసారి ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. తన సహచర ఎంపీలు, భార్యతో కలిసి అఖిలేష్ యాదవ్ సందడి చేశారు. అలాగే కర్ణాటక నుంచి కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి.. కలిసిన వారందరికీ అభివాదం చేశారు. ఇక కృష్ణానగర్ ఎంపీ మహువా మోయిత్రా కూడా ఉల్లాసంగా కనిపించారు.

ఇక సోనియాగాంధీ రాజ్యసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి సభ్యులతో ఫొటోలు దిగారు.

Exit mobile version