NTV Telugu Site icon

Train Accident: ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

Train Accident

Train Accident

Train Accident in Odisha: ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనను మరువకముందే మరో ఘటన జరిగింది. ఒడిశాలోని బెర్హంపూర్ స్టేషన్‌ వద్ద సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు రైలు దిగి పరుగులు తీశారు. ఎయిర్‌ కండిషనర్‌లో జరిగిన చిన్న షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని రైల్వే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బీ5 కోచ్‌లో ఈ మంటలు చెలరేగినట్లు వారు తెలిపారు.

Read Also: Andhra Pradesh: అధికారులపై కేంద్రమంత్రి సీరియస్‌.. అసత్యాలు చెబుతారా..?

సికింద్రాబాద్‌ నుంచి అగర్తలా వెళ్తున్న రైలు బెర్హంపూర్ స్టేషన్‌కు చేరుకోగానే బీ5 కోచ్‌లో మంటలు చెలరేగాయి. రైలులో పొగ రావడం చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. రైలులో ప్రయాణిస్తున్న కొంతమంది బీ5 కోచ్​ నుంచి పొగ రావడం చూసి.. అత్యవసర అలారంను మోగించారు. మరికొంత మంది రైలునుంచి దిగి అందులో ప్రయాణించేది లేదని తేల్చి చెప్పారు. తక్షణమే మరొక కోచ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన కోచ్‌ను అధికారులు పరిశీలించారు. 45 నిమిషాల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు ఆర్పిన తర్వాత రైలు స్టేషన్‌ నుంచి బయలుదేరింది. ఎయిర్‌ కండిషనర్‌లో జరిగిన చిన్న షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఈ మంటలు వచ్చి పొగలు వ్యాపించాయని చెప్పారు.