Fire Breaks Out in Air India: ఎయిర్ ఇండియా విమానంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో ల్యాండ్ అవ్వగానే మంటలు చెలరేగాయి. విమానంలోని ఆక్సిలరీ పవర్ యూనిట్ (APU) మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఎయిర్ ఇండియాకు చెందిన AI 315 విమానం.. మంగళవారం హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులు, సిబ్బంది దిగుతుండగా.. విమానంలో మంటలు చెలరేగాయని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. సహాయక విద్యుత్ యూనిట్ (APU)లో మంటలు చెలరేగాయి. సిస్టమ్ డిజైన్ ప్రకారం.. ఏపీయూ ఆగిపోయింది. అలాగే, అగ్నిప్రమాదం వల్ల విమానానికి కొంత నష్టం వాటిల్లిందని ఎయిర్ ఇండియా తెలిపింది. అయితే, ప్రయాణీకులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. తదుపరి దర్యాప్తు కోసం విమానాన్ని నిలిపివేశారు. మంటల గురించి నియంత్రణ సంస్థకు సమాచారం అందించారు.
APU అంటే ఏమిటో తెలుసా?
విమానంలో సహాయక విద్యుత్ యూనిట్ (Auxiliary Power Unit – APU) అనేది ఒక చిన్న గ్యాస్ టర్బైన్ ఇంజిన్. ఇది సాధారణంగా విమానం తోక భాగంలో ఉంటుంది. దీని ప్రధాన విధి విమాన ఎలక్ట్రికల్ సిస్టమ్స్‌కు విద్యుత్‌ను సరఫరా చేయడం. విమానంలో గాలిని వేడి చేయడానికి లేదా చల్లబరచడానికి ఏపీయూలు ఉపయోగపడతాయి. ప్రయాణికులకు, సిబ్బందికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తాయి.
