FIFA World Cup 2026లో గోల్స్ జోరు.. 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదు.!

Fifa World Cup 2026 (7)

Fifa World Cup 2026 (7)

FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ కొత్త చరిత్ర సృష్టించింది. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా 100 గోల్స్ నమోదైన ప్రపంచకప్‌గా ఈ ఎడిషన్ నిలిచింది. కేవలం 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ మైలురాయిని అందుకున్నారు. ఈ ప్రపంచకప్‌లో తొలి గోల్‌ను మెక్సికో ఆటగాడు జూలియన్ క్వినోనెస్ దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో నమోదు చేశాడు. ఇక నెదర్లాండ్స్ స్టార్ కోడీ గాక్‌పో స్వీడన్‌పై 5-1 తేడాతో గెలిచిన మ్యాచ్‌లో జట్టు తరఫున మూడో గోల్ సాధించి టోర్నీలో 100వ గోల్‌ను నమోదు చేశాడు.

ప్రపంచకప్ చరిత్రలో 100 గోల్స్ చేరుకోవడానికి కేవలం 33 మ్యాచ్‌లు మాత్రమే పట్టడం కొత్త రికార్డు. గతంలో 1982, 2014 ప్రపంచకప్‌లలో 36 మ్యాచ్‌లు, 1978, 1994 టోర్నీలలో 38 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. అయితే 1954లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో కేవలం 20 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదవ్వడం ఇప్పటికీ ఆల్‌టైమ్ రికార్డుగా ఉంది. ఇక నెదర్లాండ్స్ జట్టు కూడా మరో అరుదైన ఘనత సాధించింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో 100 గోల్స్ క్లబ్‌లో చేరిన ఎనిమిదో దేశంగా నెదర్లాండ్స్ నిలిచింది. స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రియాన్ బ్రోబ్బే రెండు గోల్స్ సాధించగా.. అతని రెండో గోల్ నెదర్లాండ్స్‌కు ప్రపంచకప్‌లలో 100వ గోల్‌గా చరిత్రలో నిలిచింది.

×
×
Ad

అలాగే మాంటెరే స్టేడియంలో జపాన్, ట్యునీషియా జట్ల మధ్య జరిగిన గ్రూప్-F మ్యాచ్ ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో 1,000వ మ్యాచ్‌గా నమోదైంది. ఈ సందర్భంగా ఫిఫా స్పందిస్తూ.. “1,000వ మ్యాచ్ ప్రపంచకప్ సుదీర్ఘ ప్రయాణానికి, ఫుట్‌బాల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానానికి నిదర్శనం. దేశాలు, సమాజాలను ఏకం చేసే ఫుట్‌బాల్ శక్తికి ఇది నిదర్శనం” అని పేర్కొంది.