FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!

  • ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రారంభ మ్యాచ్‌
  • మెక్సికో 2-0తో దక్షిణాఫ్రికాపై విజయం.
  • 9వ నిమిషంలో జూలియన్ క్వినోనెస్ టోర్నమెంట్ తొలి గోల్ నమోదు
  • 67వ నిమిషంలో రౌల్ జిమెనెజ్ రెండో గోల్..
Fifa World Cup 2026

Fifa World Cup 2026

FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌కు సహ-ఆతిథ్య దేశమైన మెక్సికో మంచి ప్రారంభాన్ని అందుకుంది. మెక్సికో సిటీలోని అజ్టెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ మొదటి నుంచే మెక్సికో పూర్తి ఆధిపత్యం చూపించింది. మ్యాచ్ మొదలైన తొమ్మిదో నిమిషంలోనే దక్షిణాఫ్రికా గోల్‌కీపర్ విలియమ్స్ చేసిన తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న జూలియన్ క్వినోనెస్ టోర్నమెంట్‌లో మొదటి గోల్ నమోదు చేశాడు. దీంతో మెక్సికోకు 1-0 ఆధిక్యం లభించింది. ఆ తర్వాత కూడా ఎల్ ట్రై జట్టు వరుసగా ఎటాక్ చేయడంతో ప్రత్యర్థిపై ఒత్తిడి కొనసాగించింది. బంతిపై నియంత్రణతో పాటు పలు అవకాశాలు సృష్టిస్తూ తొలి అర్ధభాగాన్ని పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచుకుంది.

రెండో అర్ధభాగంలో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. 54వ నిమిషంలో దక్షిణాఫ్రికా ఆటగాడు యాయా సిథోలే, బ్రియాన్ గుటియెరెజ్‌పై చేసిన ఫౌల్ కారణంగా రెడ్ కార్డు కారణంగా మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో దక్షిణాఫ్రికా 10 మంది ఆటగాళ్లతోనే కొనసాగాల్సి వచ్చింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న మెక్సికో 67వ నిమిషంలో మరో గోల్ సాధించింది. జూలియన్ క్వినోనెస్ అందించిన పాస్‌ ను రౌల్ జిమెనెజ్ గోల్‌ గా మర్చి జట్టుకు 2-0 ఆధిక్యం అందించాడు. ఈ గోల్‌తో మెక్సికో విజయం దాదాపు ఖాయమైంది.

×
×
Ad

దీనితో కష్టాల్లో ఉన్న దక్షిణాఫ్రికాకు మరో భారీ షాక్ తగిలింది. థెంబా జ్వానే, రోబర్టో అల్వరాడోలు ముఖంపై చేయి వేయడంతో VAR సమీక్ష తర్వాత వారికీ రెడ్ కార్డు చూపించారు. దీంతో జట్టు కేవలం 9 మంది ఆటగాళ్లతో మిగిలిపోయింది. అయితే మ్యాచ్ చివరి దశలో మెక్సికోకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా ఆటగాడు ఖులిసో ముడౌపై చేసిన ఛాలెంజ్‌ కు మెక్సికో కెప్టెన్ సీజర్ మోంటెస్‌ కు కూడా రెడ్ కార్డు విధించారు. దీంతో మ్యాచ్‌లో మొత్తం మూడు రెడ్ కార్డులు నమోదయ్యాయి.

అయినప్పటికీ మెక్సికో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 2-0 తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. స్వదేశీ అభిమానుల మద్దతుతో ప్రపంచకప్‌ను గెలుపుతో ప్రారంభించిన మెక్సికో, టైటిల్ వేటలో తమ ఆశయాలను బలంగా చాటుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికా క్రమశిక్షణ లోపం, అవకాశాలను వినియోగించుకోలేకపోవడం వల్ల ఓటమితో టోర్నీని మొదలు పెట్టింది.