14 నిమిషాల్లో 3 గోల్స్‌.. మాయ చేసిన Argentina.! ఓటమి అంచుల నుంచి క్వార్టర్స్‌ బరిలోకి ఛాంపియన్స్‌.!

Argentina

Argentina

FIFA World Cup 2026 Argentina: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా (Argentina) ఫిఫా ప్రపంచకప్‌ 2026లో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో చివరి 14 నిమిషాల్లో 3 గోల్స్‌ చేసి ఈజిప్ట్‌పై 3-2తో సంచలన విజయం సాధించి క్వార్టర్స్‌ లోకి అడుగుపెట్టింది. ఒక దశలో 78వ నిమిషం వరకు 0-2తో వెనుకబడిన అర్జెంటీనా.. లియోనెల్‌ మెస్సీ నాయకత్వంలో అద్భుతంగా పుంజుకుని క్వార్టర్‌ లోకి అర్హత సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాధించిన ఈ మ్యాచ్ ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిందనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.

ఈజిప్ట్ మాయ:

మ్యాచ్ ప్రారంభం నుంచే బంతిపై అర్జెంటీనా ఆధిపత్యం చెలాయించినా.. గోల్ మాత్రం ఈజిప్ట్ ఖాతాలో పడింది. 15వ నిమిషంలో యాసిర్ ఇబ్రహీం కార్నర్ కిక్‌ను అద్భుతంగా గోల్‌గా మలిచి ఈజిప్ట్‌కు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత పెనాల్టీ రూపంలో అర్జెంటీనాకు సమం చేసే అవకాశం వచ్చినా, మెస్సీ కొట్టిన స్పాట్ కిక్‌ను ఈజిప్ట్ గోల్‌కీపర్ మొస్తఫా షోబిర్ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత అర్జెంటీనా వరుస దాడులు చేసినప్పటికీ.. ఈజిప్ట్ రక్షణ శ్రేణి గోడలా నిలిచింది. ఫస్ట్ హాఫ్‌ లోనే అలెక్సిస్ మెక్ అలిస్టర్, జూలియన్ అల్వరెజ్ చేసిన ప్రయత్నాలను కూడా షోబిర్ సమర్థంగా అడ్డుకోవడంతో అర్జెంటీనా వెనుకపడింది. ఇక రెండో ఆర్థంలో కూడా అర్జెంటీనా దాడులు కొనసాగించినా ఫలితం కనిపించలేదు. 67వ నిమిషంలో మొస్తఫా జికో మరో అద్భుత గోల్ చేయడంతో ఈజిప్ట్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అప్పటికే మ్యాచ్‌లో మరో 20 నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో డిఫెండింగ్ ఛాంపియన్ టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఆశ్చర్యపరిచిన అర్జెంటీనా:

చివరి 20 నిమిషాలలో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. 79వ నిమిషంలో మెస్సీ ఇచ్చిన అద్భుత క్రాస్‌ను క్రిస్టియన్ రొమెరో హెడర్‌ తో గోల్‌గా మలిచి అర్జెంటీనాకు ఆశలు కల్పించాడు. ఆపై నాలుగు నిమిషాలకే లాటారో మార్టినెజ్ పాస్‌ను అందుకున్న లియోనెల్ మెస్సీ పవర్‌ఫుల్ షాట్‌తో గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేశాడు. ఇక ఇంజరీ టైమ్‌లో కూడా దాడులు ఆపని అర్జెంటీనా చివరకు 90+2వ నిమిషంలో విజయగోల్ నమోదు చేసింది. మార్టినెజ్ అందించిన క్రాస్‌ను ఎంజో ఫెర్నాండెజ్ హెడర్‌తో గోల్‌గా మలచడంతో స్టేడియం మొత్తం అర్జెంటీనా అభిమానుల సంబరాలతో మార్మోగిపోయింది. 14 నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ సాధించిన అర్జెంటీనా అసాధారణ విజయంతో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.

గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ దూకుడు:

ఈ మ్యాచ్‌లో కీలక గోల్ చేసిన లియోనెల్ మెస్సీ ప్రస్తుత ప్రపంచకప్‌లో తన గోల్స్ సంఖ్యను 8కు పెంచుకున్నాడు. దీంతో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె, నార్వే స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ చెరో 7 గోల్స్‌తో మెస్సీకి పోటీగా కొనసాగుతున్నారు.