NTV Telugu Site icon

Delhi Chalo: అరగంటలో బారికేడ్లను బద్దలుకొడతాం అంటూ.. ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను ప్రారంభించిన రైతులు!

Delhi Chalo March

Delhi Chalo March

Farmers begins Delhi Chalo March: పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడం, 2020-21 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో పార్లమెంట్ వరకు ర్యాలీ (ఢిల్లీ చలో) చేపట్టేందుకు పలు రైతు సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సోమవారం రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన కీలక సమావేశం ఎలాంటి తీర్మానం లేకుండా ముగియడంతో.. ఢిల్లీ చలో మార్చ్‌ను రైతులు మంగళవారం ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు పంజాబ్‌లోని ఫతేగఢ్‌ సాహిబ్‌ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీకి పయనం అయ్యారు. పలు రాష్ట్రాల రైతు సంఘాలు కూడా ఢిల్లీకి బయల్దేరాయి.

రైతుల ఆందోళనను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. రహదారులపై బహుళ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతులను రాజధాని లోపలికి రాకుండా.. పలు చోట్ల కాంక్రీట్‌ బ్లాక్స్‌, ఇనుప కంచెలు, మేకులను అడ్డుగా పెట్టారు. సింగు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఉంది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ బారికేడింగ్‌లు ఏర్పాటు చేసినా తాము ఆందోళన చెందమని, అరగంటలో బారికేడ్లను బద్దలుకొడతాం అని రైతులు అంటున్నారు.

Also Read: Ishan Kishan: ఇషాన్‌ కిషన్‌పై బీసీసీఐ సీరియస్‌.. వేటు తప్పదా?

మరోవైపు కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ జనరల్ సెక్రటరీ శర్వణ్‌ సింగ్‌ పంధేర్‌ మాట్లాడుతూ… ‘మేం బారికేడ్లను బద్దలు కొట్టాలనుకోవడం లేదు. చర్చలతోనే మా సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నాం. కానీ కేంద్రం మాకు ఏ విధంగా సాయం చేయడం లేదు. మా డిమాండ్లపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని మేము భావించడం లేదు. ప్రభుత్వం మాకు ఏదైనా ఆఫర్ చేసి ఉంటే.. అప్పుడు మేము పునరాలోచించవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఢిల్లీ చలో మార్చ్ మొదలుపెట్టాం. రోడ్లను బ్లాక్‌ చేస్తామని మేం ఎక్కడా చెప్పలేదు. ప్రభుత్వమే అలా చేస్తోంది. పంజాబ్‌, హరియాణా సరిహద్దులు అంతర్జాతీయ సరిహద్దుల్లా కన్పిస్తున్నాయి’ అని అన్నారు.