Delhi: కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ఇవాళ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో నేటి ఉదయం 11 గంటలకు పాదయాత్ర చేస్తామని రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉదయం 11 గంటలలోపు స్పందించాలని లేదంటే ఢిల్లీకి బయలుదేరుతామని రైతు సంఘాల నేతలు చెప్పుకొచ్చారు. రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సింగూ సరిహద్దుల్లోని ఢిల్లీ పోలీసులతో పాటు మిగతా అన్ని జిల్లాల సరిహద్దుల్లో సుమారు ఐదు వేల మంది పోలీసులు, పారామిలటరీ బలగాలు గస్తీ కాస్తున్నాయి. అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్, జీటీ రోడ్, సోనిపట్, ఢిల్లీలోని సింగు సరిహద్దులో ఏర్పాటు చేసిన 40 లేయర్ బారికేడ్‌లను బద్దలు కొట్టడానికి శంభు సరిహద్దు దగ్గర పోక్‌లేన్, హైడ్రా, జేసీబీలను కూడా రైతులు ఏర్పాటు చేశారు.
Read Also: UPSC Notification 2024: 1056 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..పూర్తి వివరాలివే..
ఇక, మరోవైపు హర్యానా ప్రభుత్వం 7 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత నేటి వరకు పొడిగించింది. 177 సోషల్ మీడియా ఖాతాలు, వెబ్ లింక్‌లను హర్యానా సర్కార్ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. అయితే, ఇప్పటి వరకు జరిగిన నాలుగోదశ చర్చల్లో ఐదు పంటల ఎంఎస్‌పీపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టం, రుణమాఫీ సహా తమ డిమాండ్ల కోసం మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో ‘ఢిల్లీ చలో’ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11గంటలలోపు కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.
