NTV Telugu Site icon

Fake Garlic: సిమెంట్‌తో చేసిన నకిలీ వెల్లుల్లి విక్రయం.. జాగ్రత్త సుమీ!

Fake Garlic

Fake Garlic

వెల్లుల్లి చాలా రకాల వంటల్లో వాడుతుంటాం. ఇది రుచే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ప్రస్తుతం వెల్లుల్లి ధర పెరిగింది. దీంతో మార్కెట్లోకి నకిలీ వెల్లుల్లి వస్తోంది. తాజాగా మహారాష్ట్ర అకోలాలో నకిలీ వెల్లుల్లిని విక్రయిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇక్కడ వెల్లుల్లి ధర బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు కూరగాయల విక్రయదారులు సిమెంటుతో తయారు చేసిన నకిలీ వెల్లుల్లిని ప్రజలకు విక్రయిస్తున్నారు. అకోలాలోని పలు ప్రాంతాల్లో ఇదే జరుగుతోందని ప్రజలు చెబుతున్నారు. చిరువ్యాపారులు నకిలీ వెల్లుల్లిని తక్కువ ధరకే ప్రజలకు విక్రయించి వెళ్లిపోతున్నారు. నగరాల్లో ప్రస్తుతం వెల్లుల్లి ధర కిలోకు రూ.300 నుంచి రూ. 350 వరకు పెరిగింది.

READ MORE: ATM Theft: 48 గంటల వ్యవధిలో మూడు ఏటీఏంలను కొల్లగొట్టేశారు..

అకోలా నగరంలోని బజోరియా నగర్‌లో నివసిస్తున్న పోలీస్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ అధికారి సుభాష్ పాటిల్ కు కూడా నకిలీ వెల్లుల్లి అమ్మారు. ఇంటిముందుకు వచ్చిన వ్యాపారి వద్ద ఆయన భార్య వెల్లుల్లిని కొనుక్కుంది. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత వెల్లుల్లి తొక్క తీయడం ప్రారంభించినప్పుడు.. గట్టిగా అనిపించింది. కత్తితో కోసినా లాభం లేకుండా పోయింది. దీంతో దాన్ని పూర్తిగా పరీక్షిస్తే.. అది సిమెంటుతో తయారు చేయబడిందని తేలింది. సిమెంట్, రంగుతో తయారు చేయబడింది. ఈ నకిలీ వెల్లుల్లినికి తెల్ల పెయింట్ చేశారు. ఇది నిజమైన వెల్లుల్లి వలె కనిపిస్తుంది. దీంతో ఆ విశ్రాంత ఉద్యోగి సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించారు..