Chaitanyapuri Fraud Case: కోట్లలో వరకట్నం, ఘనంగా నిశ్చితార్థం.. చైతన్యపురిలో నకిలీ ఎఫ్‌సీఐ ఉద్యోగి దొరికిపోయాడిలా!

  • ఎఫ్‌సీఐలో గ్రేడ్-3 టెక్నికల్ మేనేజర్‌గా నకిలీ ఐడీ కార్డు
  • కోట్లలో వరకట్నం, ఘనంగా నిశ్చితార్థం
  • చైతన్యపురిలో నకిలీ ఎఫ్‌సీఐ ఉద్యోగి దొరికిపోయాడిలా
Hyderabad Dowry Scam

Hyderabad Dowry Scam

చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి పేరుతో భారీ మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. అల్కాపురి కాలనీ కొత్తపేట్‌కు చెందిన పనస మధు (30) అనే వ్యక్తి తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)లో గ్రేడ్-3 టెక్నికల్ మేనేజర్‌గా చెర్లపల్లిలో పనిచేస్తున్నానని నకిలీ ఐడీ కార్డు సృష్టించాడు. ఎఫ్‌సీఐలో ఉద్యోగం అంటూ నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతిని పెళ్లి పేరుతో వలలో వేసుకున్నాడు. మొదట పెళ్లి కోసం రూ.2 కోట్లు డిమాండ్ చేసిన మధు.. ఆ తరువాత కోటిన్నర రూపాయల వరకట్నంకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో నల్గొండలో నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది.

Also Read: Sara Tendulkar: లక్నో, గుజరాత్ మ్యాచ్‌లో వదిన-మరదళ్ల సందడి.. సారా టెండూల్కర్ మద్దతు ఎవరికి?

‘ఫ్రీ వెడ్డింగ్ షూట్’ పేరుతో అమ్మాయిని మధు తన గదికి పిలిపించి, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు వేధింపులకు గురిచేశాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు మధు గురించి విచారణ చేయగా.. నకిలీ ఐడీతో మోసం చేస్తున్నాడని బయటపడింది. తాను మోసపోయానని గ్రహించిన యువతి చైతన్యపురి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రెండు నకిలీ ఎఫ్‌సీఐ ఐడీ కార్డులు, ఒక మొబైల్ ఫోన్, On Government Duty అని రాసి ఉన్న కారు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.