Site icon NTV Telugu

Gorantla Madhav: రాజమండ్రి సెంట్రల్ జైలుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్!

Ycp Mp Gorantla Madhav

Ycp Mp Gorantla Madhav

మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఉదయం 5 గంటల 20 నిమిషాల సమయంలో మాధవ్‌తో పాటు మరో ఐదుగురిని 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమండ్రి జైలు అధికారులకు అప్పగించారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడి చేయడంతో పాటు విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్న కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. గోరంట్ల మాధవ్‌ను మొదట నెల్లూరు జైలుకు రిమాండ్ కోసం పంపాలని న్యాయమూర్తి ఆదేశించినప్పటికీ.. అక్కడ ఇబ్బందులు ఉన్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు.‌ దీంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా పోలీసులు సంతకాలు చేసిన అనంతరం రాజమండ్రి జైలుకు తీసుకువచ్చారు.

Also Read: AP News: అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం.. ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొన్న..!

మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడు చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తుండగా.. గోరంట్ల మాధవ్ తన అనుచరులతో కలిసి పోలీసు వాహనాన్ని అడ్డుకొని దాడి చేశారు. ఈ కేసులో మాధవ్ సహా ఆరుగురిపై గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. గోరంట్ల మాధవ్‌తో పాటు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు రమేష్, దామోదర్, శివ ప్రసాద్, శివయ్య, సురేందర్‌లు 14 రోజుల రిమాండ్‌లో ఉండనున్నారు.

Exit mobile version